ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న కాలనీల్లో ఖాళీగా ఉన్న ఇళ్ల స్థలాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్లు నిర్మించుకునేందుకు ఆసక్తి ఉన్న అర్హులకు ఖాళీ ప్లాట్లు కేటాయించడంతో పాటు.. ప్రస్తుతం కేటాయించిన స్థలం వద్దనుకునే లబ్ధిదారులకు మరో ప్రాంతంలో స్థలం ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్యలను 45 రోజుల్లోగా పరిష్కరించేందుకు ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు. గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో పాటు కందుల దుర్గేష్ లేదా నాదెండ్ల మనోహర్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు.

గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల్లో స్థలాలు పొందిన లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసి.. ఇళ్లు నిర్మించుకునేందుకు వారు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రవాణా, మౌలిక వసతులు సరిగా లేకపోవడంతో కొందరు లబ్ధిదారులు అక్కడ ఇళ్లు నిర్మించేందుకు ఆసక్తి చూపడం లేదని ప్రభుత్వం గుర్తించింది.

ఇలాంటి సందర్భాల్లో లబ్ధిదారుల అభీష్టం మేరకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించే అంశాన్ని పరిశీలించనున్నారు. ఖాళీగా ఉన్న స్థలాలు, లబ్ధిదారులు వద్దనుకున్న ప్లాట్లను గుర్తించి.. అర్హులైన కొత్త లబ్ధిదారులకు కేటాయించేలా కమిటీ నివేదిక ఇవ్వనుంది.

ఇటీవల నిర్వహించిన ఆవాస్‌ సర్వేలో మరో రెండు లక్షల మందికి ఇళ్ల స్థలాలు అవసరమని గుర్తించారు. వీరికి అవసరమైన భూసేకరణపై కూడా కమిటీ అధ్యయనం చేయనుంది. గతంలో ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూసేకరణలో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్‌ దర్యాప్తులో తేలడంతో.. బాధ్యులపై క్రిమినల్‌ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

3.71 లక్షల ఇళ్లను రద్దు చేసిన కేంద్రం

మరోవైపు PMAY అర్బన్‌-1.0 కింద ఏపీకి మంజూరైన ఇళ్లలో నిర్మాణం ప్రారంభం కాని 3.71 లక్షల ఇళ్లను కేంద్రం రద్దు చేసింది. 2024 డిసెంబర్‌తో పథకం గడువు ముగియగా.. రాష్ట్రాల విజ్ఞప్తితో కేంద్రం రెండుసార్లు గడువు పొడిగించింది. అయినప్పటికీ 2026 జూలై నాటికి నిర్మాణం ప్రారంభం కాని ఇళ్లను రద్దు చేసినట్లు కేంద్రం రాష్ట్రానికి లేఖ రాసింది.

రద్దయిన ఇళ్లలో ఇప్పటికే జియోట్యాగింగ్‌ పూర్తయిన 1.27 లక్షల ఇళ్లను పునరుద్ధరించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మిగిలిన 2.44 లక్షల ఇళ్లను PMAY అర్బన్‌-2.0లోకి మళ్లించాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *