
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు, ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.
విశాఖపట్నంలో రూ.35 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఆధునీకరించిన ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం ఎంపీ శ్రీభరత్ పునఃప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు సురక్షితమైన, నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు వారి సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా వాతావరణాన్ని, ఆధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థలపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని శ్రీభరత్ పేర్కొన్నారు. విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా పాఠశాలలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
