
విజయవాడలో పాన్ ఐఐటీ ఏపీ సమ్మిట్ 2026 శనివారం ఘనంగా ప్రారంభమైంది. మంత్రి నారా లోకేశ్ జ్యోతి ప్రజ్వలన చేసి సమ్మిట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల డైరెక్టర్లు, ఐటీ నిపుణులు, విధాన నిర్ణేతలు పాల్గొంటున్నారు. ఇంధనం, స్వచ్ఛాంధ్ర, డీప్‌టెక్, స్పేస్, ఏరోస్పేస్ తదితర అంశాలపై కీలక ప్యానెల్ చర్చలు జరగనున్నాయి.
సమ్మిట్ ఛైర్ స్వదీప్ పిల్లారిశెట్టి మాట్లాడుతూ గత 20 ఏళ్లలో తొలిసారిగా విజయవాడలో పాన్ ఐఐటీ ఆధ్వర్యంలో ఇంత భారీ స్థాయిలో కార్యక్రమం జరుగుతోందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఐఐటీల డైరెక్టర్లు ఈ సమ్మిట్‌కు హాజరవుతున్నారని తెలిపారు. ఇది కేవలం కాన్ఫరెన్స్ కాదని కన్వర్జెన్స్ అని స్వదీప్ పిల్లారిశెట్టి పేర్కొన్నారు. ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ రంగాల్లో రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
రాష్ట్ర అభివృద్ధి కేవలం అభినందనలతో సాధ్యం కాదని, బోర్డు రూమ్‌లలో తీసుకునే నిర్ణయాలే అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తోందని తెలిపారు. ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందించడంతో పాటు పాలనను సరళతరం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
మంత్రి నారా లోకేశ్ ప్రస్తావిస్తున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ‘ప్రభుత్వం తక్కువగా కనిపించాలి పాలన ఎక్కువగా అందాలి’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రోయాక్టివ్ పాలసీలను తీసుకొచ్చామని కాటంనేని భాస్కర్ వెల్లడించారు. సెమీకండక్టర్, లిఫ్ట్ తదితర రంగాలకు సంబంధించిన పాలసీలను అమలు చేస్తున్నామని చెప్పారు.
కంపెనీలు అత్యుత్తమ ప్రతిభను రాష్ట్రానికి తీసుకువస్తే వారికి అవసరమైన సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలకు అనుకూలమైన గమ్యస్థానంగా భావించి రాష్ట్రంలోని అవకాశాలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. సమ్మిట్‌లో జరిగే చర్చల అనంతరం ‘పాన్ ఐఐటీ అమరావతి డిక్లరేషన్’కు సిద్ధం కావాలని కాటంనేని భాస్కర్ పేర్కొన్నారు.
