
అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వయోజనురాలైన కుమార్తెను ఆమె ఇష్టానికి విరుద్ధంగా తమ వద్దే ఉండాలని తల్లిదండ్రులు బలవంతం చేయలేరని కోర్టు స్పష్టం చేసింది. అలాంటి ఉద్దేశంతో దాఖలు చేసే హెబియస్ కార్పస్ పిటిషన్లు చెల్లుబాటు కావని పేర్కొంది.
తన తల్లి ప్రవర్తనతో విభేదించిన 25 ఏళ్ల యువతి ఢిల్లీలో స్వతంత్రంగా జీవిస్తున్న కేసును జస్టిస్ సందీప్ జైన్ ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా మేజర్ అయిన వ్యక్తికి తన ఇష్టానుసారం ఎక్కడ నివసించాలి, ఎవరితో జీవించాలి అనే నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
వయోజనురాలి వ్యక్తిగత స్వేచ్ఛ, నిర్ణయాధికారాన్ని గౌరవించాల్సిందేనని పేర్కొంటూ ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది.
వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కుల పరిరక్షణ విషయంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వయోజనురాలైన కుమార్తెను ఆమె ఇష్టానికి విరుద్ధంగా తమతోనే నివసించేలా తల్లిదండ్రులు బలవంతం చేయలేరని స్పష్టం చేసింది. ఇందుకోసం హెబియస్ కార్పస్ పిటిషన్ను ఆశ్రయించడం కూడా సమర్థనీయం కాదని పేర్కొంది.
జస్టిస్ సందీప్ జైన్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం సెప్టెంబర్ 28న ఈ మేరకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. మేజర్ అయిన వ్యక్తి తన జీవితంపై స్వయంగా నిర్ణయాలు తీసుకునే హక్కు కలిగి ఉంటారని న్యాయస్థానం పేర్కొంది.
తల్లిదండ్రులు కన్నవారే అయినప్పటికీ, వయోజనురాలు స్వచ్ఛందంగా వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని విస్మరించి ఆమెపై తమ నిర్ణయాలను రుద్దలేరని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఆమె తన ఇష్టానుసారం ఎక్కడ నివసించాలి, ఎవరితో జీవించాలి అనే విషయంలో స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాకరించలేమని పేర్కొన్నారు.
కళావతి దేవి అనే మహిళ తన 25 ఏళ్ల కుమార్తె పూజను కోర్టు ఎదుట హాజరుపరచాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారించిన హైకోర్టు.. 2026 ఆగస్టు 17న పూజను కోర్టు ఎదుట హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది.
కోర్టు ఆదేశాల మేరకు అధికారులు పూజను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆమెతో నేరుగా మాట్లాడి, ఆమె అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. తాను ఢిల్లీలో ఎలాంటి నిర్బంధంలో లేనని, పూర్తిగా తన స్వేచ్ఛతోనే అక్కడ జీవిస్తున్నానని పూజ స్పష్టం చేసింది.
తల్లి వద్దకు తిరిగి వెళ్లి నివసించేందుకు తనకు ఏమాత్రం ఆసక్తి లేదని ఆమె కోర్టుకు తెలిపింది. పుట్టింట్లో ఉన్న సమయంలో తన తల్లి నుంచి వేధింపులు ఎదుర్కొన్నానని, తరచూ భౌతిక దాడులు, దూషణలకు గురయ్యానని ఆరోపించింది. అయితే పూజ చేసిన ఆరోపణలను కళావతి దేవి ఖండించారు. తన కుమార్తెను తిరిగి ఇంటికి పంపించాలని ఆమె కోర్టును కోరారు.
అయితే పూజ వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఆమెకు ప్రస్తుతం 25 ఏళ్లు ఉండటంతో మేజర్ అని, తన జీవితానికి సంబంధించిన మంచి చెడులను స్వయంగా నిర్ణయించుకునే పరిపక్వత, చట్టబద్ధమైన హక్కు ఆమెకు ఉన్నాయని పేర్కొంది.
