ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సన్నద్ధమవుతోంది. ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక అడ్‌హాక్ కమిటీలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు మరో నాలుగు కీలక కమిటీలను కూడా నియమించారు.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీపై ప్రత్యేక దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు, ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలను సన్నద్ధం చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

ఈ క్రమంలో రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక అడ్‌హాక్ కమిటీలను ఏర్పాటు చేశారు. విజయవాడ మినహా మిగతా పార్లమెంట్ కమిటీల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

క్షేత్రస్థాయి పరిస్థితులపై ప్రత్యేక నిఘా

ఈ అడ్‌హాక్ కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ బలాబలాలు, ఎన్నికల సన్నద్ధతపై సమాచారాన్ని సేకరించనున్నాయి. కమిటీల పనితీరును పవన్ కల్యాణ్ స్వయంగా పర్యవేక్షించనున్నారు. సభ్యులతో త్వరలో సమావేశమై ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు.

ప్రతి కమిటీలో ముగ్గురు పార్లమెంట్ స్థాయి నాయకులతో పాటు, పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముగ్గురు నాయకులను నియమించారు. వీరికి సహకరించేందుకు నిర్వాహక్ దళ్‌ను కూడా ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ కమిటీలు కొనసాగనున్నాయి.

మరో నాలుగు కీలక కమిటీలు

అడ్‌హాక్ కమిటీలతో పాటు జనసేన మరో నాలుగు కీలక కమిటీలను ఏర్పాటు చేసింది. అవి:

  • ఎన్నికల నిర్వహణ, మార్గదర్శక కమిటీ
  • కూటమి సమన్వయ కమిటీ
  • ప్రచార కమిటీ
  • ట్రెజరీ (ఆర్థిక) కమిటీ

ఈ కమిటీల ద్వారా ఎన్నికల నిర్వహణ, కూటమి పార్టీలతో సమన్వయం, ప్రచార వ్యూహాలు, ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించే లక్ష్యంతో జనసేన నాయకత్వం ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *