
గుంటూరు, ఆంధ్రప్రభ: పల్నాడు జిల్లా సత్తెనపల్లి సమీపంలో మద్యం మినీ లారీ బోల్తాపడింది. గుంటూరు నుంచి వస్తున్న ఈ లారీ.. సత్తెనపల్లి వద్ద మేజర్ కెనాల్ బ్రిడ్జిపై టైరు పగలడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో లారీలోని మద్యం, బీరు సీసాలు రోడ్డుపై, పక్కనే ఉన్న కాలువలో చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో కొన్నిబాటిళ్లు పగిలిపోయి భారీగా నష్టం వాటిల్లింది.
లారీ ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. రోడ్డుపై పడిపోయిన మద్యం బాటిళ్ల కోసం కొందరు ఎగబడ్డారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల విలువైన మద్యం ధ్వంసమైనట్లు ప్రాథమిక అంచనా.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోడ్డుపై మద్యం సీసాలు చెల్లాచెదురుగా పడిపోవడంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు వాహనదారులు, స్థానికులు గుమిగూడారు.
