శ్రీకాకుళం జిల్లాలో రైతులు వినూత్నంగా మొగలి సాగు చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. మొగలి మొక్కలను సాగు చేస్తూ, వాటి పుష్పాలను విక్రయించడంతో పాటు పువ్వుల నుంచి ఆయిల్‌ను సేకరిస్తున్నారు.

మొగలి పుష్పాల నుంచి తీసే ఆయిల్‌కు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈ ఆయిల్ లీటర్ ధర సుమారు రూ.2.50 లక్షల వరకు పలుకుతోంది. సీజన్‌లో డిమాండ్ మరింత పెరగడంతో ధర కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

శ్రీకాకుళం జిల్లాలో ఉత్పత్తి చేస్తున్న మొగలి ఆయిల్‌ను దేశంలోని ఇతర రాష్ట్రాలకు మాత్రమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. దీంతో మొగలి సాగు రైతులకు అధిక ఆదాయాన్ని అందించే లాభదాయకమైన పంటగా మారుతోంది.

మొగలి పువ్వుల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. సాధారణంగా కొంతమంది ఇళ్ల పరిసరాల్లో మొగలి చెట్లను పెంచుతుంటారు. రైతులు కూడా పొలాల చుట్టూ, కాలువ గట్లపై ఈ మొక్కలను సాగు చేస్తుంటారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో మొగలి చెట్లు ఎత్తుగా, దట్టంగా పెరిగి భూములకు రక్షణ గోడలా నిలుస్తాయి.

అలాంటి మొగలి చెట్లు ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో దాదాపు 6 వేల హెక్టార్ల విస్తీర్ణంలో మొగలిని సాగు చేస్తున్నారు. మొగలి పువ్వులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో రైతులు వాటిని విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో పండించే మొగలి పువ్వులకు దేశీయంగానే కాకుండా విదేశాల్లోనూ డిమాండ్ ఉంది. దీంతో ఇక్కడి నుంచి మొగలి పుష్పాలను ఇతర ప్రాంతాలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. సంప్రదాయంగా రక్షణ కోసం పెంచే మొగలి చెట్లు.. ఇప్పుడు రైతులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయి.

ఒక్క కొమ్మను నాటితే ఏడాదిలోపే పిలకలు వేసి దట్టమైన కంచెలా మారుతుంది. అంతేకాదు, ఈ మొక్కలకు పెద్దగా తెగుళ్లు సోకవు. నీటి అవసరం కూడా చాలా తక్కువ. ఇలాంటి ప్రత్యేకతలున్న మొగలి సాగు రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తోంది.

ఒక్కో మొగలి చెట్టు నుంచి ఏడాదిలో సుమారు నాలుగు నెలల పాటు పూల దిగుబడి వస్తుంది. ఒక్క చెట్టుకు వెయ్యి వరకు పూలు పూసే అవకాశం ఉంటుంది. రైతులు ఈ మొగలి పువ్వులను ఒక్కోటి సుమారు రూ.14 నుంచి రూ.16 వరకు విక్రయిస్తున్నారు. సీజన్‌లో డిమాండ్ పెరిగితే ధర మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో మొగలి పువ్వులకు మంచి గిరాకీ ఉంటుంది.

మొగలి పువ్వులతో సువాసన నూనె తయారీ

మొగలి పువ్వులకు కేవలం పూల మార్కెట్‌లోనే కాదు.. సువాసన నూనె తయారీలోనూ ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. శ్రీకాకుళం జిల్లాలో మొగలి పువ్వుల నుంచి అత్తరు, సువాసన ద్రావణాలను తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి.

ప్రత్యేక పద్ధతిలో ఇత్తడి పాత్రల్లో మొగలి పువ్వులను వేసి వేడి చేస్తారు. పువ్వుల నుంచి వెలువడే ఆవిరిని మరో పాత్రలోకి పంపించి చల్లబరుస్తారు. అనంతరం ఏర్పడే సువాసన నూనెను ప్రత్యేక పాత్రల్లో సేకరిస్తారు.

ఈ నూనెకు సీజన్‌ను బట్టి భారీ ధర పలుకుతుంది. ఒక లీటరు సుమారు రూ.2.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు విక్రయమవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ సువాసన నూనెను చైనా, రష్యా, అమెరికా వంటి దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. దేశీయంగా కాన్పూర్, భువనేశ్వర్, జైపూర్, కోల్‌కతా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు కూడా దీనిని కొనుగోలు చేస్తున్నారు.

20 వేల పువ్వులతో లీటరు నూనె

ఒక లీటరు సువాసన ద్రావణాన్ని తయారు చేయాలంటే దాదాపు 20 వేల మొగలి పువ్వులు అవసరమవుతాయి. ఈ ద్రావణాన్ని ప్రధానంగా కాస్మెటిక్స్, ఔషధాల తయారీలో వినియోగిస్తారు. కీళ్ల సంబంధిత వాత నొప్పులను తగ్గించడంలోనూ ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

అంతేకాదు, మొగలి పువ్వుల నుంచి తయారయ్యే ఈ సువాసన ద్రావణాన్ని ఒడిశాలో అగరబత్తుల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. దీంతో మొగలి సాగుకు స్థానికంగానే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోనూ మార్కెట్ ఏర్పడింది.

వ్యవసాయ అనుబంధ రంగంగా మొగలి సాగును ప్రోత్సహిస్తే రైతులకు మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందని సాగుదారులు చెబుతున్నారు. ప్రభుత్వం మొగలి సాగుకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తే మరింత మంది రైతులు ఈ పంట వైపు వచ్చే అవకాశం ఉందని వారు కోరుతున్నారు.