
ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్ నెలలో జరగనున్న అఖిల భారత పోలీస్ డైరెక్టర్ జనరల్స్ (డీజీపీలు) సదస్సుకు ప్రధానమంత్రి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తిరుపతి జిల్లా ఏర్పేడులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) ప్రాంగణాన్ని ఈ సదస్సు నిర్వహణకు వేదికగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు ఇప్పటికే అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన డీజీపీలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అయితే, ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 4 నుంచి 6 వరకు తిరుపతి జిల్లా ఏర్పేడు సమీపంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐసర్) ప్రాంగణంలో అఖిల భారత పోలీస్ డైరెక్టర్ జనరల్స్ (డీజీపీలు) సదస్సు నిర్వహించనున్నారు.
ఈ ప్రతిష్ఠాత్మక సమావేశానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన డీజీపీలు, సుమారు 400 మంది ఐపీఎస్ అధికారులు హాజరుకానున్నట్లు సమాచారం. దేశంలో పోలీసు వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, అంతర్గత భద్రత, శాంతిభద్రతలు వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో చర్చించే అవకాశం ఉంది. అయితే, ప్రధాని మోదీ, అమిత్ షా, అజిత్ ధోవల్ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
డీజీపీలు, ఐపీఎస్ అధికారుల సదస్సు.. ఏర్పాట్లపై అధికారుల సమీక్ష
తిరుపతి జిల్లా ఏర్పేడు సమీపంలోని ఐసర్ ప్రాంగణంలో నిర్వహించనున్న అఖిల భారత పోలీస్ డైరెక్టర్ జనరల్స్ (డీజీపీలు) సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు వెంకటప్పలనాయుడు, విశాల్ గున్నీతో పాటు పోలీసు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు.
తిరుచానూరులోని తాజ్ హోటల్‌లో జిల్లా ఉన్నతాధికారులతో ఐబీ అధికారులు సమావేశమై వసతి, భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. అనంతరం ఏర్పేడులోని ఐసర్ ప్రాంగణాన్ని పరిశీలించారు. అలాగే తిరుపతి ఐఐటీతో పాటు వ్యవసాయ, కలినరీ, వెటర్నరీ విశ్వవిద్యాలయాల్లోని అతిథి గృహాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. నగరంలోని పలు స్టార్ హోటళ్లలో వసతి సదుపాయాలపైనా అధికారులు ఆరా తీశారు. సదస్సుకు హాజరయ్యే ప్రముఖుల భద్రత, ఇతర ఏర్పాట్లకు సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.
తిరుమల బ్రహ్మోత్సవాలకు భారీ పోలీసు బందోబస్తు
మరోవైపు, తిరుమలలో అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల భద్రత కోసం పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఉత్సవాల బందోబస్తు కోసం మొత్తం 2,800 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు అధికారులు వెల్లడించారు.
అక్టోబర్ 16న గరుడసేవ, 17న పుష్పకవిమానం, 19న స్వర్ణరథం, 20న చక్రస్నానం నిర్వహించనున్న నేపథ్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు.
తిరుమలలోని నాలుగు మాడ వీధులు, గ్యాలరీలు, ప్రధాన రాకపోకల మార్గాలు, ఘాట్ రోడ్లు, పార్కింగ్ ప్రాంతాల్లో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల బారికేడ్లు, దారి సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టి భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.
తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు, పార్కింగ్ నిర్వహణ, గరుడసేవ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపులు, అత్యవసర వాహనాల రాకపోకలకు ప్రత్యేక మార్గాల ఏర్పాటు వంటి అంశాలపై పోలీసులు దృష్టి సారించనున్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు తిరుపతిలో అవసరమైన హోల్డింగ్ పాయింట్లను వినియోగించుకోవాలని నిర్ణయించారు. టీటీడీ, ఆర్టీసీ, రవాణా శాఖతో పాటు ఇతర సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు తిరుమల వన్‌టౌన్, టూటౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ‘మే ఐ హెల్ప్ యూ’ టీ-షర్టులు ధరించిన పోలీసు సిబ్బందిని భక్తులకు సహాయం అందించేందుకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ సిబ్బంది నాలుగు మాడ వీధుల గ్యాలరీలకే పరిమితం కాకుండా తిరుమలవ్యాప్తంగా భక్తులకు మార్గదర్శనం చేస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారని అధికారులు తెలిపారు.
దర్శన మార్గాలు, క్యూలైన్లు, వసతి గృహాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలన్నా, ఏదైనా సహాయం అవసరమైనా భక్తులు ఈ ప్రత్యేక పోలీసు సిబ్బందిని నేరుగా సంప్రదించవచ్చని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, సేవల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
