మహాలయ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులతో సమాజంలో ఆనందం, కరుణ, సహనం వెల్లివిరియాలని, దేశవ్యాప్తంగా శాంతి, సౌభాగ్యాలు వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్ (X) వేదికగా తెలుగు, ఇంగ్లీష్, బెంగాలీ భాషల్లో ప్రత్యేక సందేశాలను పంచుకున్నారు. దుర్గామాత అనుగ్రహంతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నిండాలని, సమాజంలో దయ, సహనం పెంపొందాలని పేర్కొన్నారు.
దేవీ శరన్నవరాత్రుల ఆగమనానికి సంకేతంగా మహాలయను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పర్వదినంతో పితృపక్షం ముగిసి, దుర్గామాత భూలోకానికి విచ్చేస్తుందనే విశ్వాసంతో దేవీ నవరాత్రుల వేడుకలకు భక్తులు సిద్ధమవుతారు.
మహాలయ సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే ఆధ్యాత్మిక సందడి నెలకొంది. అస్సాంలోని జోర్హాట్ సహా పలు ప్రాంతాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి భజనలు, ప్రత్యేక పూజలతో దుర్గామాతకు స్వాగతం పలికారు. ఆలయాలు, పూజా మండపాలు భక్తులతో సందడిగా మారాయి.