తమిళనాడు రాజధాని చెన్నైలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఒకే వేదికపై పాల్గొన్నారు. రాష్ట్రాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు. సీఎం విజయ్‌తో కలిసి తమిళనాడు అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. చెన్నై ట్రేడ్ సెంటర్, ఐఐటీ మద్రాస్ ఆవరణలోని కేంద్రీయ విద్యాలయ గ్రౌండ్స్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో రూ.13,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభం
చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా ఫేజ్-2లోని కారిడార్ 4కు చెందిన పూనమల్లి వడపళని మార్గాన్ని ప్రధాని మోదీ, సీఎం విజయ్ కలిసి ప్రారంభించారు. సుమారు 15 కిలోమీటర్ల పొడవున, 11 స్టేషన్లతో నిర్మించిన ఈ మార్గంలో పూనమల్లి బైపాస్ నుంచి పోరూర్ వరకు ఇరువురు నేతలు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ప్రయాణికులతో ముచ్చటించారు. ప్రధాని మోదీ యూపీఐ (UPI) ద్వారా మెట్రో టికెట్ కొనుగోలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తయారీ రంగంలో తమిళనాడు కీలక పాత్ర
భారతదేశ తయారీ రంగం వృద్ధిలో తమిళనాడు కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని మోదీ ప్రశంసించారు. 2014తో పోలిస్తే దేశ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగాయని, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీ దేశంగా భారత్ ఎదిగిందని పేర్కొన్నారు.
తూత్తుకుడిలోని చిదంబరనార్ పోర్టును ప్రపంచ స్థాయి గ్రీన్ ఎనర్జీ, మెగా కంటైనర్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.17,000 కోట్లతో పనులు వేగవంతం చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు.
మెట్రో విస్తరణ, హైస్పీడ్ రైళ్లకు విజయ్ విజ్ఞప్తి
ఈ కార్యక్రమంలో ప్రసంగించిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయడం అత్యంత ముఖ్యమని అన్నారు. రాష్ట్రానికి అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు.
చెన్నై మెట్రో ఫేజ్-3 విస్తరణలో భాగంగా ఎయిర్‌పోర్ట్‌కి ల్పాక్కం, పూనమల్లి సుంగువార్సత్రం మార్గాలకు తక్షణమే ఆమోదం తెలపాలని ప్రధానిని విజ్ఞప్తి చేశారు. అలాగే చెన్నై కన్యాకుమారి, చెన్నై కోయంబత్తూర్ మార్గాల్లో హైస్పీడ్ రైలు కారిడార్లను ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే తమిళనాడు అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.