
సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడం తగదని రాష్ట్ర హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. భూమి, స్థలాలు, ఆస్తుల హక్కులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించే అధికారం పోలీసులకు లేదని తేల్చిచెప్పింది. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుని, ఇరుపక్షాలను పోలీస్ స్టేషన్లకు పిలిపించి రాజీ చేయడం లేదా సెటిల్మెంట్కు ప్రయత్నించడం చట్టవిరుద్ధమని పేర్కొంది.
ఇటీవల భూములు, ఆస్తుల పంపకాల విషయంలో సివిల్ కోర్టుల్లో కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ పోలీసులు తమను స్టేషన్లకు పిలిపించి వేధిస్తున్నారంటూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన న్యాయస్థానం పోలీసుల తీరుపై తీవ్రంగా స్పందించింది.
సివిల్ కోర్టు లేదా ఇతర చట్టబద్ధమైన ఫోరమ్లలో విచారణలో ఉన్న వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకుని పరిష్కరించేందుకు ప్రయత్నించరాదని హైకోర్టు స్పష్టం చేసింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం డివిజన్, జిల్లా స్థాయి అధికారులు, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లకు కొన్ని అధికారాలు ఉన్నప్పటికీ.. ఒక వివాదం సివిల్ కోర్టు పరిధిలోకి వెళ్లిన తర్వాత ఆ అధికారాలను ఉపయోగించి సివిల్ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకూడదని గుర్తుచేసింది.
సివిల్ వివాదాల్లో పోలీసులు ఎలా వ్యవహరించాలనే అంశంపై గత అక్టోబర్ 24న రాష్ట్ర డీజీపీ జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు ఆదేశించింది. బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం సివిల్ కోర్టును ఆశ్రయించాలా? లేక ఇతర చట్టబద్ధమైన ఫోరమ్లను ఆశ్రయించాలా? అనేది వారి నిర్ణయానికే వదిలివేయాలని పేర్కొంది.
అయితే, సివిల్ వివాదం పేరుతో ఏదైనా కాగ్నిజబుల్ నేరం జరిగినట్లు తేలితే, చట్టప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. సివిల్ వివాదం పేరుతో పోలీసు అధికారాన్ని ఉపయోగించి ఇరుపక్షాలను వేధించడం లేదా బలవంతంగా సెటిల్మెంట్ చేయడం మాత్రం అనుమతించబోమని తేల్చిచెప్పింది.
