
పేదల సొంతింటి కలను సాకారం చేయడం సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 5.50 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి పేదలకు అందించామని తెలిపారు.
ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని సుజాత విమర్శించారు. పేదలకు ఇళ్లు నిర్మించకపోగా 6 లక్షల ఇళ్లను రద్దు చేసి వారి సొంతింటి కలను దెబ్బతీశారని ఆరోపించారు. సెంటు స్థలం పట్టాల పేరుతో గత ప్రభుత్వం రూ.7 వేల కోట్ల అక్రమార్జనకు పాల్పడిందని ఆమె ఆరోపించారు.
ప్రస్తుతం సాధారణ కోటా కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 75 వేల ఇళ్లను మాత్రమే మంజూరు చేసిందని సుజాత తెలిపారు. అయితే సీఎం చంద్రబాబు కేంద్రంతో చర్చించి రాష్ట్రానికి అదనంగా 3 లక్షల ఇళ్లను మంజూరు చేయించారని పేర్కొన్నారు. తెనాలిలో దేశంలోనే తొలిసారిగా 3డీ టెక్నాలజీతో 177 ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.
అలాగే కొత్తగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారని చెప్పారు. PMAY-U 2.0 2026 అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని సుజాత వెల్లడించారు. పేదల గృహ నిర్మాణంలో పారదర్శకత, వేగవంతమైన అమలుకు ఈ అవార్డు నిదర్శనమని అన్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న ‘స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్’ విధానానికి గృహ నిర్మాణ రంగంలో సాధించిన పురోగతి చక్కటి ఉదాహరణగా పేర్కొన్నారు. 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పీతల సుజాత స్పష్టం చేశారు.
