మహారాష్ట్రలో ఘనంగా నిర్వహించనున్న సింహస్థ కుంభమేళా ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు ఆహ్వానించారు. అక్టోబర్ 31న జెండా ఎగురవేసి కుంభమేళాను అధికారికంగా ప్రారంభించాలని కోరారు. ఈ సందర్భంగా మహా హారతి కార్యక్రమంతో పాటు నాసిక్‌ త్రయంబకేశ్వర్ కుంభమేళా వెబ్‌సైట్‌ను ప్రారంభించాలని కుంభమేళా నేపథ్య గీతాన్ని ఆవిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే కుంభమేళా విశిష్టతను వివరించే కాఫీ టేబుల్ పుస్తకాన్ని కూడా ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రులు ఏక్‌నాథ్ షిండే, సునేత్ర పవార్, పలువురు క్యాబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికత, గిరిజన వారసత్వ కళలను ప్రతిబింబించే ప్రత్యేక బహుమతులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు.

సింహస్థ కుంభమేళా ప్రాధాన్యాన్ని చాటిచెప్పేలా ఆహ్వాన పత్రికను ప్రత్యేకంగా రూపొందించారు. నాసిక్ ప్రాంత ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మిక విశిష్టతను ప్రతిబింబించేలా దీనిని తీర్చిదిద్దారు. గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో తయారు చేసిన ధూప్‌స్టిక్స్, చిరుధాన్యాలతో రూపొందించిన ఆహార పదార్థాలు, మహువా పువ్వులతో తయారు చేసిన ఉత్పత్తులు, వెదురు వస్తువులు, స్వచ్ఛమైన తేనెతో పాటు మహారాష్ట్రకు ప్రత్యేకమైన పైఠాని చీరను రాష్ట్రపతికి బహూకరించారు.

ఈ బహుమతులు మహారాష్ట్ర సాంస్కృతిక వైవిధ్యాన్ని, సంప్రదాయ కళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని అధికారులు తెలిపారు. అదే సమయంలో గిరిజనులు, స్థానిక కళాకారులు, చేనేత కార్మికుల ఉత్పత్తులకు గుర్తింపు కల్పించడం వారికి ఆర్థిక స్థిరత్వాన్ని అందించడమే ఈ కానుకల వెనుక ప్రధాన ఉద్దేశమని వివరించారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *