
RBI New Loan Recovery Rules 2027: లోన్ తీసుకున్నవారికి ఊరట.. రికవరీ ఏజెంట్లకు RBI కీలక నిబంధనలు!
మీరు బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారా? అయితే ఈ వార్త మీకు ఉపయోగకరం. రుణ బకాయిల వసూళ్ల సమయంలో వినియోగదారులను వేధించకుండా, వారి గౌరవం, గోప్యతను కాపాడేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఈ నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
రికవరీ ఏజెంట్లు ఏం చేయకూడదు?
కొత్త నిబంధనల ప్రకారం రుణ వసూళ్ల పేరుతో రికవరీ ఏజెంట్లు:
- బెదిరింపులు, అసభ్యకరమైన భాషను ఉపయోగించకూడదు.
- కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి వేధించకూడదు.
- రుణగ్రహీత వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయకూడదు.
- పదేపదే కాల్స్, మెసేజ్లు చేసి ఇబ్బంది పెట్టకూడదు.
- హింస, ఆస్తి లేదా పరువు నష్టం గురించి బెదిరించకూడదు.
- రుణగ్రహీతను బహిరంగంగా అవమానించకూడదు.
ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల మధ్యే కాల్స్
రికవరీ ఏజెంట్లు రుణగ్రహీతలను ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే సంప్రదించాలి. ఈ సమయానికి వెలుపల సంప్రదించాలంటే రుణగ్రహీత అనుమతి ఉండాలి. కుటుంబంలో మరణం, వైద్య అత్యవసర పరిస్థితి వంటి సున్నితమైన సందర్భాల్లో రికవరీ కోసం ఇబ్బంది పెట్టకూడదు.
ఇంటికి వచ్చే ముందు సమాచారం తప్పనిసరి
రికవరీ ఏజెంట్ వ్యక్తిగతంగా కలవడానికి వచ్చే ముందు బ్యాంకు కనీసం ఒక రోజు ముందుగా రుణగ్రహీతకు సమాచారం ఇవ్వాలి. ఏజెంట్ వద్ద ఐడీ కార్డు, అధికారిక లేఖ, బ్యాంకు నోటీసు ఉండాలి.
రికవరీ ఏజెంట్ తప్పు చేస్తే బ్యాంకుదే బాధ్యత
రికవరీ ప్రక్రియను ఏజెన్సీకి అప్పగించినప్పటికీ.. ఏజెంట్ల ప్రవర్తనకు బ్యాంకులే బాధ్యత వహించాలి. ఏజెన్సీలపై బ్యాంకులు పర్యవేక్షణ, తనిఖీలు కొనసాగించాలి.
రికవరీ కాల్స్ రికార్డు చేయాలి
రుణ వసూళ్లకు సంబంధించిన కాల్స్ సమయం, సంఖ్య, సంభాషణ వివరాలను బ్యాంకులు రికార్డు చేయాలి. ఈ రికార్డులను సాధారణంగా కనీసం ఆరు నెలలు భద్రపరచాలి.
వేధింపులు జరిగితే ఫిర్యాదు చేసే అవకాశం
రికవరీ ప్రక్రియలో వేధింపులు లేదా నిబంధనల ఉల్లంఘన జరిగితే ఫిర్యాదు చేసేందుకు ప్రతి బ్యాంకు ప్రత్యేక గ్రీవెన్స్ రిడ్రెస్సల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. RBI మార్గదర్శకాలకు విరుద్ధంగా రికవరీ చర్యల వల్ల నష్టం జరిగితే పరిహారం అందించే విధానాన్ని కూడా బ్యాంకులు తమ పాలసీలో పొందుపరచాలి.
2027 జనవరి 1 నుంచి అమలు
ఈ కొత్త RBI మార్గదర్శకాలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. రుణ బకాయిలు వసూలు చేసుకునే హక్కు బ్యాంకులకు ఉన్నప్పటికీ.. ఆ ప్రక్రియలో రుణగ్రహీతలను బెదిరించడం, వేధించడం లేదా వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం అనుమతించబోమన్న సందేశాన్ని ఈ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

