డిగ్రీలు, ప్రతిభ, ఎదగాలన్న బలమైన ఆకాంక్ష ఉన్నప్పటికీ నైపుణ్యాలు ఉంటేనే యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు.

డిగ్రీలు, ప్రతిభ ఉన్నప్పటికీ.. ఉద్యోగ అవకాశాలు అందుకోవాలంటే యువతలో అవసరమైన నైపుణ్యాలు ఉండటం కీలకమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మారుతున్న టెక్నాలజీ, పరిశ్రమలకు అనుగుణంగా యువత నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని సూచించారు.

శనివారం టీ-వర్క్స్‌లో నిర్వహించిన ‘ఫ్యూచర్‌ స్కిల్స్‌ సమ్మిట్‌ అవార్డ్స్‌-2026’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త ఆర్థిక వ్యవస్థలో నేర్చుకోవాలన్న ఆసక్తి, నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ఎంతో అవసరమని చెప్పారు.

కృత్రిమ మేధస్సు(ఏఐ) కారణంగా ఉద్యోగాల స్వరూపం మారే అవకాశం ఉన్నప్పటికీ.. అదే సమయంలో కొత్త వృత్తులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెద్దఎత్తున అందుబాటులోకి వస్తాయని శ్రీధర్‌బాబు వివరించారు. ఏఐ, అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌, క్వాంటమ్‌ టెక్నాలజీలు భవిష్యత్తు సాంకేతిక విప్లవంలో కీలక పాత్ర పోషించనున్నాయని తెలిపారు.

బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో 20 వేల ఉద్యోగాలు

బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌(బీఎఫ్‌ఎస్‌ఐ) రంగంలో సుమారు 20 వేల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. ఈ అవకాశాలను యువత అందిపుచ్చుకునేలా అవసరమైన నైపుణ్య శిక్షణ అందించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న 10 వేల మంది విద్యార్థులకు పరిశ్రమల సహకారంతో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శిక్షణకే పరిమితం కాకుండా.. విద్యార్థులను నేరుగా ఉపాధి అవకాశాలతో అనుసంధానించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఫ్యూచర్‌ స్కిల్స్‌ సమ్మిట్‌ నిర్వాహకులు రమణ, క్రిష్‌, టీ-వర్క్స్‌ సీఈవో జోగిందర్‌ తణికెళ్ల, టాస్క్‌ సీఈవో నితిన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

By Ramya