
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. హర్యానాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సౌరభ్ శేఖర్ (36) కొండాపూర్‌లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో మృతిచెందాడు. హీలియం గ్యాస్ పీల్చుకోవడం వల్ల ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్నారు.
హీలియం వాయువును సాధారణంగా బెలూన్లు, పరిశ్రమలు, శాస్త్రీయ ప్రయోగాల్లో ఉపయోగిస్తారు. అయితే, ఈ వాయువు అధికంగా ఉన్న వాతావరణంలో ఆక్సిజన్ అందకపోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ప్రాణాపాయం సంభవించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. హర్యానాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సౌరభ్ శేఖర్ (36) ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఆయన రాయదుర్గంలోని మైహోమ్ ఆభ్రాలో నివాసం ఉంటున్నారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం స్నేహితుడిని కలిసేందుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరారు. అదే రోజు రాత్రి కొండాపూర్‌లోని రాఘవేంద్ర కాలనీలో ఉన్న ఓ సర్వీస్ అపార్ట్మెంట్ చిరునామాను కుటుంబ వాట్సాప్ గ్రూపులో పంపినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం వరకు ఆయన ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఫోన్ చేయగా, ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.
దీంతో సౌరభ్ సోదరుడు సర్వీస్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి పరిశీలించగా, ఆయన మృతిచెంది కనిపించారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అక్కడ హీలియం గ్యాస్ సిలిండర్‌ను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక వివరాల ప్రకారం, హీలియం గ్యాస్ పీల్చుకోవడం వల్లే ఆయన మృతిచెందినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో ‘అమ్మా, నాన్నా నన్ను క్షమించండి’ అని రాసిన నోట్ లభించినట్లు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. గత పదేళ్లుగా భోజనం చేసిన తర్వాత కడుపునొప్పితో బాధపడుతున్నట్లు సౌరభ్ కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అయితే, ఆయన మృతికి గల పూర్తి కారణాలు పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
హీలియం గ్యాస్‌ను దేనికి ఉపయోగిస్తారు?
హీలియం రంగు, వాసన లేని వాయువు. ఇది రసాయనికంగా స్థిరంగా ఉండటంతో వివిధ రంగాల్లో వినియోగిస్తారు. పుట్టినరోజులు, ఇతర వేడుకల్లో బెలూన్లను గాలిలో తేలేలా చేసేందుకు, శాస్త్రీయ పరిశోధనల్లో, ప్రత్యేక పారిశ్రామిక ప్రక్రియల్లో, వెల్డింగ్ పనుల్లో, ఎంఆర్ఐ యంత్రాల శీతలీకరణ వ్యవస్థల్లో దీనిని ఉపయోగిస్తారు. అవసరాన్ని బట్టి ప్రత్యేక సిలిండర్లలో సరఫరా చేస్తారు.
హీలియం సాధారణ పరిస్థితుల్లో విషపూరిత వాయువు కాకపోయినా, దాన్ని పీల్చడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాలిలో ఆక్సిజన్ స్థాయిని తగ్గించే పరిస్థితులు ఏర్పడితే శరీరంలోని మెదడు, గుండె వంటి కీలక అవయవాలకు తగినంత ఆక్సిజన్ అందదు. దీనివల్ల తలతిరగడం, గందరగోళం, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలతో పాటు తీవ్రమైన సందర్భాల్లో ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. అందువల్ల హీలియం గ్యాస్‌ను పీల్చడం లేదా దాని వినియోగంలో నిర్లక్ష్యం వహించడం ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు.
