
హైదరాబాద్‌ను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీలో విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల ఏర్పాటుకు సుమారు 250 ఎకరాలు కేటాయించాలని యోచిస్తోంది. ఒక్కో యూనివర్సిటీకి 20 నుంచి 25 ఎకరాల చొప్పున కేటాయించి, దాదాపు పది క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోంది.
అమెరికా, బ్రిటన్ వర్సిటీలపై ప్రత్యేక దృష్టి
ప్రపంచస్థాయి విద్యాసంస్థలను హైదరాబాద్‌కు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక పాలసీ రూపొందిస్తోంది. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలోని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలను ఆకర్షించేందుకు అవసరమైన ప్రోత్సాహకాలు, ఇతర సౌకర్యాలపై కసరత్తు చేస్తోంది.
పేద విద్యార్థులకు ఫీజు భారం తగ్గించే యోచన
విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లలో చదివే అవకాశం ప్రతిభావంతులైన పేద విద్యార్థులకూ కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా అర్హత కలిగిన విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే చెల్లించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది. ఈ ప్రణాళిక కార్యరూపం దాలిస్తే హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి విద్య అందుబాటులోకి రావడంతోపాటు, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరాన్ని కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుంది.
హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అంతర్జాతీయంగా పేరొందిన విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా భారత్ ఫ్యూచర్ సిటీలో సుమారు 250 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించింది.
ఒక్కో విదేశీ విశ్వవిద్యాలయానికి 20 నుంచి 25 ఎకరాల చొప్పున కేటాయించి, దాదాపు పది అంతర్జాతీయ విద్యాసంస్థలను ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే ఫ్యూచర్ సిటీ అంతర్జాతీయ విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది.
దీంతో హైదరాబాద్‌లో ఉన్నత విద్యతోపాటు పరిశోధన రంగానికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లు అందుబాటులోకి వస్తే అంతర్జాతీయ స్థాయి విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు మరిన్ని మార్గాలు తెరుచుకోనున్నాయి. అలాగే ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి విద్యార్థులు హైదరాబాద్‌కు వచ్చే అవకాశాలు పెరిగి, నగరానికి అంతర్జాతీయ విద్యా గుర్తింపు మరింత బలపడే అవకాశం ఉంది.
ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల ఏర్పాటును ముందుకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. విదేశీ విద్యాసంస్థలను ఆకర్షించేందుకు అవసరమైన ప్రోత్సాహకాలు, భూమి ధర, మౌలిక సదుపాయాలు, అనుమతులు, పెట్టుబడులకు సంబంధించిన విధివిధానాలను రూపొందించేందుకు వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని నియమించింది.
ప్రతి విశ్వవిద్యాలయానికి వేర్వేరుగా నిబంధనలు రూపొందించకుండా.. అన్ని అంతర్జాతీయ విద్యాసంస్థలకు వర్తించేలా సమగ్ర పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. క్యాంపస్‌లకు భూమి కేటాయింపు ధర ఎంత ఉండాలి? ఎలాంటి రాయితీలు కల్పించాలి? నిర్మాణాలకు అవసరమైన సదుపాయాలు ఎలా అందించాలి? వంటి అంశాలపై కమిటీ అధ్యయనం చేస్తోంది. గ్లోబల్ సమిట్ నాటికి విదేశీ విశ్వవిద్యాలయాలను ఆకర్షించే విధానాన్ని సిద్ధం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.
అన్ని క్యాంపస్‌ల విద్యార్థులకు ఉమ్మడి సదుపాయాలు
ఫ్యూచర్ సిటీలో దాదాపు పది విదేశీ విశ్వవిద్యాలయాలు ఒకే ప్రాంతంలో ఏర్పాటయ్యే అవకాశమున్న నేపథ్యంలో, విద్యార్థుల కోసం ఉమ్మడి సదుపాయాలను కల్పించే అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఆటస్థలాలు, స్టేడియం, ఇతర క్రీడా వసతులను అన్ని క్యాంపస్‌ల విద్యార్థులు వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించాలని భావిస్తున్నారు.
దీనివల్ల ప్రతి విశ్వవిద్యాలయం విడిగా అన్ని సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం తగ్గడంతోపాటు, విద్యార్థులకు మెరుగైన వసతులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ విద్యాసంస్థలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా ఫ్యూచర్ సిటీని ఉన్నత విద్య, పరిశోధన రంగాలకు కీలక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది
