
ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం… ఉత్తరాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు కొత్త ఊపునిస్తుందనే అంచనాలు ప్రారంభమయ్యాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ ఉత్తరాంధ్ర పారిశ్రామికాభివృద్ధికి ముఖద్వారమైతే… భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ప్రాంత భవిష్యత్ అభివృద్ధికి ఆకాశ ద్వారంగా మారే సామర్థ్యాన్ని కలిగి ఉంది. విమానాశ్రయం రాకతో ఇక్కడ పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.
భోగాపురం విమానాశ్రయం ప్రత్యేకత దాని పరిమాణంలోనే కాదు… దాని వెనుక ఉన్న భవిష్యత్ ప్రణాళికలోనూ ఉంది. మొత్తం 2,703 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్రాజెక్టులో 2,203 ఎకరాల్లో విమానాశ్రయ నిర్మాణం చేపట్టగా, మరో 500 ఎకరాలను ఏవియేషన్ హబ్ కోసం కేటాయించారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల అభివృద్ధికి అనుకూలంగా ఈ హబ్‌ను రూపొందించారు. అదనంగా ఏవియేషన్ యూనివర్సిటీ, ఎడ్యుసిటీ కోసం భూమి కేటాయించడం ద్వారా ఇది కేవలం రవాణా కేంద్రంగా కాకుండా, విజ్ఞానం, పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి కూడా వేదికగా మారే అవకాశం ఉంది.
అలాగే 25 వేల మెట్రిక్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యంతో కార్గో టెర్మినల్‌ను ఏర్పాటు చేశారు. కార్గో సౌకర్యం భోగాపురం ఆర్థిక ప్రాధాన్యాన్ని మరింత పెంచనుంది. ఉత్తరాంధ్ర నుంచి ఎగుమతి అయ్యే సముద్ర ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, ఉద్యాన పంటలు, విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు వేగంగా అంతర్జాతీయ మార్కెట్లకు చేరుకునే అవకాశం ఉంటుంది. తద్వారా వాణిజ్య కార్యకలాపాలు విస్తరించడంతోపాటు విదేశీ మారకద్రవ్య ఆర్జనకు కూడా అవకాశాలు పెరుగుతాయి.

