ఓవల్‌ ఆఫీసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆరోగ్య-మానవ సేవల శాఖ మంత్రి రాబర్ట్‌ ఎఫ్‌. కెన్నడీ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో వారి మధ్యలో నిలబడిన ఓ యువతికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె పదేపదే తన పొట్టపై చేయి వేసుకోవడంతో.. ట్రంప్‌ను నిద్రలేపేందుకు ఎలక్ట్రిక్‌ షాక్‌ ఇస్తోందంటూ నెటిజన్లు రకరకాల కథనాలు ప్రచారం చేశారు.

అయితే ఈ ప్రచారంపై ఆ యువతి స్వయంగా స్పందించారు. తాను గర్భవతిని కావడం వల్లే పొట్టపై చేయి వేసుకున్నానని స్పష్టం చేశారు. దీంతో తన గురించి సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూసి తాను ఆశ్చర్యపోయానని తెలిపారు.

ఆమెను కన్జర్వేటివ్‌ మీడియా, లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌ ‘ది కన్జర్వేటర్‌’ వ్యవస్థాపకురాలు, సీఈఓ జేమీ లీగ్‌ ఫ్రాంక్లిన్‌గా పలు వార్తా సంస్థలు గుర్తించాయి. పిల్లల టీకా సిఫార్సులకు సంబంధించిన కీలక ఉత్తర్వుపై ట్రంప్‌ సంతకం చేస్తున్న సమయంలో ఆమె ఆయన పక్కన కనిపించారు.

వైరల్‌ అవుతున్న వీడియోలో ఫ్రాంక్లిన్‌ తల ఊపుతూ, తన చేతిని పొట్టపై ఉంచుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలకు నెటిజన్లు తమకు తోచిన విధంగా అర్థాలు చెబుతూ పోస్టులు చేయగా.. చివరకు ఫ్రాంక్లిన్‌ అసలు కారణాన్ని వెల్లడించి వాటికి చెక్‌ పెట్టారు.

By Ramya