
AP | చిత్తూరు, పంచాయతీ ఎన్నికల విధుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఇద్దరు రిటర్నింగ్ అధికారులపై చిత్తూరు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. విధుల్లో ఇష్టానుసారంగా వ్యవహరించినట్లు గుర్తించడంతో ఎన్ఆర్ పేట, తుమ్మింద ఎన్నికల రిటర్నింగ్ అధికారులను సస్పెండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
చిత్తూరు మండలం ఎన్ఆర్ పేట రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న విజయకుమారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆమె బొమ్మసముద్రం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అలాగే తుమ్మింద రిటర్నింగ్ అధికారిగా ఉన్న దూర్వాసులును కూడా సస్పెండ్ చేశారు. ఆయన నరహరిపేట ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అధికారులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవనే సంకేతాన్ని జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం ద్వారా ఇచ్చింది.




