ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణికులకు త్వరలో కీలక సౌకర్యం అందుబాటులోకి రానుంది. బెంగళూరు ముంబై మధ్య వందే భారత్ స్లీపర్ రైలు సేవలను ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రైలు ఏపీలోని అనంతపురం, గుంతకల్ మీదుగా ప్రయాణించనుంది. దీంతో రాష్ట్రంలోని ప్రయాణికులకు వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణించే అవకాశం లభించనుంది.

బెంగళూరు ముంబై మధ్య ప్రస్తుతం రైలు ప్రయాణానికి సుమారు 22 నుంచి 24 గంటల వరకు సమయం పడుతోంది. కొత్త వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తే ఈ ప్రయాణ సమయం సుమారు 16 గంటలకు తగ్గే అవకాశం ఉంది. దాదాపు 1,137 కిలోమీటర్ల దూరాన్ని ఈ సెమీ హైస్పీడ్ రైలు వేగంగా పూర్తి చేయనుంది.

ప్రతిపాదిత టైమింగ్స్ ఇవే

రైల్వేశాఖ అధికారికంగా టైమ్‌టేబుల్‌ను ఇంకా ప్రకటించనప్పటికీ, ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం బెంగళూరు సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ నుంచి రాత్రి 7:50 గంటలకు రైలు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 11:55 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్‌కు చేరుకోనుంది.

తిరుగు ప్రయాణంలో ముంబై నుంచి రాత్రి 8:10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 11:55 గంటలకు బెంగళూరుకు చేరుకునేలా షెడ్యూల్ రూపొందించినట్లు సమాచారం. మొత్తంగా సుమారు 15 గంటల 45 నిమిషాల్లో ఈ ప్రయాణం పూర్తయ్యే అవకాశం ఉంది.

ఏపీలో రెండు స్టాపులు

ఈ వందే భారత్ స్లీపర్ రైలుకు ఏపీలో అనంతపురం, గుంతకల్ స్టేషన్లలో హాల్ట్‌లు ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రతిపాదిత రైలు నంబర్లు 27651, 27652 గా ఉన్నట్లు సమాచారం.

బెంగళూరు ముంబై మార్గంలో ఇప్పటికే డబుల్ ట్రాక్ ఉండటంతో పాటు విద్యుదీకరణ కూడా పూర్తయింది. ఈ మార్గంలో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడిపే సామర్థ్యం ఉండటంతో వందే భారత్ స్లీపర్ సేవలకు ఈ మార్గాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

16 కోచ్‌లతో రైలు

ఈ సర్వీస్ కోసం 16 కోచ్‌ల వందే భారత్ స్లీపర్ రైలు సెట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML), ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) కలిసి ఈ రైలు సెట్‌ను తయారు చేశాయి.

మొత్తం 16 కోచ్‌లలో 11 కోచ్‌లు థర్డ్ ఏసీ, 4 కోచ్‌లు సెకండ్ ఏసీగా ఉండనున్నాయి. టికెట్ ధరలపై పూర్తి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ థర్డ్ ఏసీ టికెట్ ధర సుమారు రూ.3,000 వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ ఛార్జీలోనే బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం కూడా అందించే అవకాశం ఉంది. అధికారిక టైమ్‌టేబుల్, స్టాపులు, టికెట్ ధరలను రైల్వేశాఖ ప్రకటించిన తర్వాతే తుది వివరాలపై స్పష్టత రానుంది.

By Rajini