
భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఈ నెల 26, 27 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విజయవాడ, తిరుపతి జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి, తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్నారు.
ఈ నెల 26న ఉదయం ప్రత్యేక విమానంలో విజయవాడ విమానాశ్రయానికి చేరుకోనున్న ఉపరాష్ట్రపతి.. అక్కడి నుంచి అంబేద్కర్ స్మృతివనాన్ని సందర్శిస్తారు. అనంతరం అంబేద్కర్ కళావేదికలో నిర్వహించనున్న డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 40వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
అనంతరం తిరుపతికి చేరుకుని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. రాత్రి తిరుపతిలో బస చేయనున్నారు. ఈ నెల 27న ఉదయం తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం తిరుపతి విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన వివరాలను రాష్ట్ర అధికారులు వెల్లడించారు.
