
అభివృద్ధి అంటే ప్రభుత్వం కేటాయించే నిధులను ఖర్చు చేయడం మాత్రమే కాదని సొంత ఆలోచనలతో నిధులు సమీకరించి అభివృద్ధి పనులు చేపట్టడమేనని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయానికి కొత్త రూపు తీసుకొచ్చేలా తన ఆలోచనలతో నిధులు సమకూరుస్తానని పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పరిషత్‌ను కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని మండలాల జడ్పీటీసీ అభ్యర్థులతో కలిసి నామినేషన్ కేంద్రానికి వచ్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డి వారితో కలిసి జిల్లా పరిషత్‌లో నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే తాడిపత్రికి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ సెంటర్ రానుందని వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం రెండు ప్రాంతాల్లో మాత్రమే ఇటువంటి కేంద్రాలు ఉన్నాయని చెప్పారు.
యల్లనూరు జడ్పీటీసీ స్థానానికి టీడీపీ తరఫున ఎంటెక్ చదువుతున్న యువతిని బరిలోకి దింపుతున్నట్లు జేసీ తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోయినా ఫర్వాలేదని, తాడిపత్రిలో ఫ్యాక్షన్ రాజకీయాలకు ముగింపు పలకడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలంటే తనకు ఎలాంటి భయం లేదని ఆయన అన్నారు. గతంలో తాను తన కుమారుడు స్థానిక ఎన్నికల్లో పోటీ చేశామని తన సోదరుడు కూడా గతంలో రాజకీయంగా కీలక బాధ్యతలు నిర్వహించారని గుర్తుచేశారు.
రాబోయే రోజుల్లో తాను వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి కలిసి రాళ్లు వేసుకుంటుంటే ప్రజలు తమ ఇద్దరిపై రాళ్లు వేసే పరిస్థితి వస్తుందని జేసీ చమత్కరించారు. ప్రజల్లో మార్పు వస్తోందని, 2028 నాటికి రాజకీయ నాయకులను చెప్పుతో కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తు ఎన్నికల్లో నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
