
ఉరవకొండ :రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు. ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల గ్రామంలో టీడీపీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులురెడ్డి, జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఇన్చార్జి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజు, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, నియోజకవర్గ పరిశీలకుడు మల్లెల రాజశేఖర్, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవాస్తవాలను నమ్మకుండా ప్రజలతో మమేకమై పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతి గ్రామానికి రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని, హంద్రీనీవా కాలువ వెడల్పు పనులతో రాయలసీమలోని పలువురు రైతులకు ప్రయోజనం కలుగుతోందని మంత్రి తెలిపారు.
ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పయ్యావుల కేశవ్ అన్నారు.
సమావేశానికి కూడేరు, బెలుగుప్ప, విడపనకల్లు, ఉరవకొండ, వజ్రకరూరు మండలాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
