రైతులు హలం పట్టుకుని పొలానికి వెళ్లాలే తప్ప, అర్జీలు పట్టుకుని అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రైతుల భూములకు భద్రత కల్పించడం, వారి హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు. ‘మీ భూమి.. మీ హక్కు.. భూమిపై హక్కు మీదే. ఆ హక్కును కాపాడే బాధ్యత మాది. ఇదే సీబీఎన్ మార్క్’ అని పేర్కొన్నారు.
శుక్రవారం ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని నర్సింగోలులో పర్యటించిన సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూములపై రైతులకు పూర్తి భరోసా కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
40.58 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 40.58 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు. అక్టోబర్ నెలలోనే 793 గ్రామాల్లో 4.58 లక్షల మంది రైతులకు పాస్‌పుస్తకాలు అందించినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలో 24,116 పాస్‌పుస్తకాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
పాస్‌పుస్తకాల పంపిణీని వేగవంతం చేసేందుకు అధికారులకు లక్ష్యాలను నిర్దేశించినట్లు సీఎం చెప్పారు. నిర్ణీత లక్ష్యాలను చేరుకోని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు తమ భూముల హక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.
రెండేళ్లలో పోతుల చెంచయ్యపాలేరు రిజర్వాయర్ పూర్తి
ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోతుల చెంచయ్యపాలేరు రిజర్వాయర్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినట్లు చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించారు. రిజర్వాయర్ నిర్మాణానికి రూ.166 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా 9,500 ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. రైతులకు నీటిని అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. సాగునీటి సదుపాయాల అభివృద్ధితో రైతులకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.