స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అభ్యర్థులు, బూత్ స్థాయి కార్యకర్తలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన వైసీపీ తీరుపై మండిపడ్డారు. రాజకీయాల్లో జగన్ లాంటి ‘క్రిమినల్ లిటిగెంట్లు’ ఉండటం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. తానే విధ్వంసానికి పాల్పడి, తిరిగి తానే కోర్టులను ఆశ్రయించే ఆలోచనలు జగన్‌కే వస్తాయని విమర్శించారు.

వైసీపీని ‘గొడ్డలి పార్టీ’గా అభివర్ణించిన చంద్రబాబు.. అభివృద్ధి పనులు, ఎన్నికలను అడ్డుకోవడమే ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. మెగా డీఎస్సీ, అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలు కలిగించేందుకు వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేశారని విమర్శించారు. ఓటరు జాబితా, బీసీ రిజర్వేషన్ల అంశాలపైనా న్యాయస్థానాలను ఆశ్రయించి ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

జగన్ బెంగళూరులో కూర్చొని విధ్వంసకర వ్యూహాలు రచిస్తున్నారని, ఇతర రాష్ట్రాల నుంచి గూండాలను రప్పించేందుకు కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మంచి అభ్యర్థులను ఎంపిక చేస్తుంటే, వైసీపీ మాత్రం విధ్వంసకారులను ఎన్నికల బరిలోకి దించుతోందని విమర్శించారు.

కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన, బీజేపీతో సమన్వయంతో పనిచేస్తూ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారానికి వారం రోజులే సమయం ఉన్నందున మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అభ్యర్థులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని సూచించారు.

ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని, అదే సమయంలో వైసీపీ పాలనలో చోటుచేసుకున్నాయని తాము ఆరోపిస్తున్న అరాచకాలను, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. వికృత మనస్తత్వం కలిగిన వ్యక్తులను రాజకీయాలకు దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *