
ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్.. ఇన్నోవా హైక్రాస్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్ వెర్షన్‌ను ప్రకటించింది. ఈ మోడల్ ప్రారంభ ధరను రూ.19.99 లక్షలుగా (ఎక్స్‌షోరూం) నిర్ణయించింది. ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో పనిచేసే ఈ వాహనం ద్వారా ప్రత్యామ్నాయ ఇంధన వినియోగానికి సంస్థ ప్రాధాన్యం ఇస్తోంది.
ఈ20 నుంచి ఈ85 వరకు..
ఇన్నోవా హైక్రాస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ ఇకపై ఫ్లెక్స్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెర్షన్లో మాత్రమే లభిస్తుందని టయోటా కంట్రీ హెడ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ గులాటి వెల్లడించారు. ఈ20 నుంచి ఈ85 వరకు వివిధ స్థాయుల్లో ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని ఈ వాహనంలో ఉపయోగించవచ్చని తెలిపారు.
ఇథనాల్ ఇంధనంపై భయాలు తగ్గే అవకాశం
పెట్రోల్‌లో అధిక మోతాదులో ఇథనాల్ కలిపినప్పుడు వాహనాల పనితీరు, ఇంజిన్ అనుకూలతపై వినియోగదారుల్లో కొన్ని సందేహాలు ఉంటాయి. అయితే వివిధ రకాల ఇథనాల్ మిశ్రమాలకు అనుగుణంగా పనిచేసే ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో ఈ ఆందోళనలను తగ్గించవచ్చని కంపెనీ అభిప్రాయపడింది.



