
ఖర్చులను నియంత్రిస్తూ ఆదాయాన్ని పెంచుకునే దిశగా ఎయిరిండియా గ్రూప్ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మొత్తం రూ.6,000 కోట్ల మేర వ్యయాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ సీఈఓ టెవోల్డే గెబ్రమరియం వెల్లడించారు. ఇప్పటికే దాదాపు రూ.1,500 కోట్ల పొదుపు సాధించామని, మరో రూ.3,500 కోట్ల వరకు ఖర్చులు తగ్గించేందుకు అవకాశాలున్న విభాగాలను గుర్తించామని బుధవారం తెలిపారు.
ప్రత్యేక కార్గో వ్యాపారంపై దృష్టి
కార్గో రంగంలో అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని ఎయిరిండియా భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా సరకు రవాణా వ్యాపారాన్ని ప్రారంభించే ప్రణాళికలు ఉన్నట్లు గెబ్రమరియం సంకేతాలిచ్చారు. సంస్థలోని ప్రతి విభాగంలో ఖర్చుల నియంత్రణ, జవాబుదారీతనానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఉద్యోగులకు సూచించారు.
పర్యాటక ప్యాకేజీల విక్రయంపై యోచన
ఆదాయాన్ని పెంచుకునేందుకు విమానయాన సేవలకు అదనంగా పర్యాటక కార్యకలాపాల్లోకి కూడా అడుగుపెట్టాలని ఎయిరిండియా యోచిస్తోంది. సొంతంగా పర్యాటక సేవలను నిర్వహిస్తూ వివిధ టూర్ ప్యాకేజీలను విక్రయించే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ కార్యక్రమం కోసం పర్యాటక మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేయనున్నట్లు గెబ్రమరియం తెలిపారు.
అక్టోబరులో బాధ్యతల స్వీకరణ
టెవోల్డే గెబ్రమరియం గత అక్టోబరులో ఎయిరిండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. సంస్థ కార్యకలాపాలను మరింత సమర్థంగా నిర్వహించడం, వ్యయాలను తగ్గించడం, కొత్త ఆదాయ మార్గాలను అభివృద్ధి చేయడంపై ఆయన దృష్టి సారించారు.



