ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో యువతను ఆకట్టుకున్న ఈ సినిమా అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీని వీక్షించవచ్చు.

‘#90s’ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో..

‘#90s’ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించగా.. శివాజీ, వాసుకీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాలేజీ జీవితం, ప్రేమ, కుటుంబ పరిస్థితులు, యువత ఎదుర్కొనే సందిగ్ధతలను కలగలిపి ఈ కథను తెరకెక్కించారు.

కథేంటంటే..

‘#90s’ కుటుంబంలో చిన్నవాడైన ఆదిత్య (ఆనంద్ దేవరకొండ)కు సినిమాలంటే ఎంతో ఇష్టం. దర్శకుడిగా మారి చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనేది అతడి కల. అయితే మధ్యతరగతి కుటుంబాల ఆలోచనలకు అనుగుణంగా పై చదువుల కోసం లండన్ వెళ్తాడు.

విదేశాలకు వెళ్లినా సినిమా పట్ల అతడి ఆసక్తి మాత్రం తగ్గదు. అక్కడి యూనివర్సిటీలో తెలుగమ్మాయి కడలి (వైష్ణవి చైతన్య) పరిచయం అవుతుంది. తొలి పరిచయమే క్రమంగా ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత ఇద్దరూ సహజీవనం కూడా చేస్తారు.

అయితే భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చిన ఆదిత్య, కడలి బంధం ఎలాంటి మలుపులు తిరిగింది? జీవితంలో ఇంకా స్థిరపడని ఆదిత్య ప్రేమ, పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తన కలను సాధించేందుకు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? అనే అంశాలకు సమాధానం సినిమా చూస్తేనే తెలుస్తుంది.

థియేట్రికల్ రిలీజ్ తర్వాత యూత్‌లో ఆసక్తి కలిగించిన ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ ఇప్పుడు ఓటీటీలోకి వస్తుండటంతో ఈ మూవీకి డిజిటల్ ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.