ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’లో నటిస్తున్న బన్నీ.. ఈ ప్రాజెక్ట్ తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మరో భారీ సినిమా చేయనున్నారు. దీంతో ఆయన డైరీ ఇప్పటికే చాలా కాలం పాటు బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

బన్నీ–బోయపాటి సినిమా లేనట్టేనా?

‘సరైనోడు’ తర్వాత అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మరోసారి కలిసి సినిమా చేయబోతున్నారనే వార్తలు కొంతకాలంగా టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతుందని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా లేదని తెలుస్తోంది. బోయపాటి తన తదుపరి ప్రాజెక్ట్‌ను మరోసారి నందమూరి బాలకృష్ణతో చేయడంపైనే దృష్టి పెట్టినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

బాలయ్యతో ‘అఖండ 3’?

బాలకృష్ణ–బోయపాటి కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ముఖ్యంగా ‘అఖండ’ భారీ సక్సెస్ కావడంతో ఈ కాంబోపై మరింత ఆసక్తి ఏర్పడింది. ఇప్పుడు వీరి కలయికలో ‘అఖండ 3’ తెరకెక్కే అవకాశాలపై చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం బాలకృష్ణ ‘దాదా’ సినిమాలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత కొరటాల శివతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ చిత్రం తర్వాత బోయపాటితో ‘అఖండ 3’ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

మరోవైపు అల్లు అర్జున్ కూడా అట్లీతో ‘రాకా’, ఆ తర్వాత లోకేష్ కనకరాజ్ ప్రాజెక్టులతో బిజీగా ఉండనున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ–బోయపాటి కాంబినేషన్‌పై వస్తున్న వార్తలకు ప్రస్తుతానికి బ్రేక్ పడినట్టేనని టాక్. అయితే భవిష్యత్తులో ఈ ఇద్దరూ మరోసారి చేతులు కలుపుతారా లేదా అన్నది చూడాలి.