
ఐపీఎల్ మినీ వేలానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ యువ క్రికెటర్ల పేర్లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తమ ప్రతిభను నిరూపించుకోవడంతో పాటు క్రికెట్ కెరీర్లో మరింత ముందుకు వెళ్లేందుకు ఐపీఎల్‌ను మంచి వేదికగా భావించే యువ ఆటగాళ్లు ఈసారి వేలంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ జాబితాలో భారత మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. ఇటీవల అద్భుత ప్రదర్శనలతో గుర్తింపు తెచ్చుకున్న అతడు.. డిసెంబరు 16న గోవా వేదికగా జరగనున్న ఐపీఎల్ 2027 మినీ వేలంలో పాల్గొనబోతున్నాడు. అనాక్యాప్డ్ భారత ఆటగాళ్ల విభాగంలో రూ.30 లక్షల కనీస ధరతో తన పేరును నమోదు చేసుకున్నాడు.
ఆర్యవీర్ కోసం ఫ్రాంచైజీల పోటీ?
ఇటీవల జరిగిన అండర్-19 ఆసియా కప్‌లో ఆర్యవీర్ సెహ్వాగ్ అద్భుతంగా రాణించాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 361 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో నిలిచాడు. ఈ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును సొంతం చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టి అతడిపై పడే అవకాశం ఉంది.
అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్ విజయంలో భాగమైన మోహిత్ ఉల్వా కూడా అనాక్యాప్డ్ విభాగంలో వేలానికి రానున్నాడు. మరోవైపు అనుభవజ్ఞులైన ఇషాంత్ శర్మ, నితీశ్ రాణా రూ.50 లక్షల కనీస ధరతో ఈ విభాగంలో పేర్లు నమోదు చేసుకున్నారు.
అనాక్యాప్డ్ జాబితాలో పలువురు సీనియర్లు
ఇషాంత్ శర్మ, నితీశ్ రాణా ఇప్పటికే 100కు పైగా ఐపీఎల్ మ్యాచులు ఆడినప్పటికీ.. ఐపీఎల్ నిబంధనల ప్రకారం గత ఐదేళ్లుగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని భారత ఆటగాళ్లు అనాక్యాప్డ్ విభాగంలో వేలానికి నమోదు చేసుకోవచ్చు. ఈ కారణంతోనే వీరు ఈ జాబితాలో చోటు సంపాదించారు.
వీరితో పాటు మన్దీప్ సింగ్, మయాంక్ మార్కండే, నవదీప్ సైనీ, చేతన్ సకారియా వంటి ఆటగాళ్లు కూడా అనాక్యాప్డ్ విభాగంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
వేలం కోసం 1,220 మంది ఆటగాళ్ల నమోదు
ఈసారి మినీ వేలంలో విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో ఆటగాళ్లు ఆసక్తి చూపించారు. మొత్తం 17 దేశాలకు చెందిన 281 మంది విదేశీ క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా 53 మంది ఉండగా.. దక్షిణాఫ్రికా నుంచి 40 మంది, వెస్టిండీస్ నుంచి 36 మంది, న్యూజిలాండ్ నుంచి 25 మంది, అఫ్గానిస్థాన్ నుంచి 23 మంది, శ్రీలంక నుంచి 21 మంది, ఇంగ్లండ్ నుంచి 16 మంది, బంగ్లాదేశ్ నుంచి 12 మంది ఉన్నారు.
ఇక ఐర్లాండ్ నుంచి ఏడుగురు, జింబాబ్వే నుంచి ఆరుగురు ఆటగాళ్లు వేలానికి పేర్లు ఇచ్చారు. అసోసియేట్ దేశాల నుంచి అమెరికా తరఫున 13 మంది సహా మొత్తం 42 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
మొత్తంగా 66 ఖాళీ స్థానాల కోసం 1,220 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో 939 మంది భారత ఆటగాళ్లు ఉన్నారు. అయితే వీరందరికీ వేలంలో పాల్గొనే అవకాశం ఉండదు. ఫ్రాంచైజీలు తమ అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకునే ఆటగాళ్లతో తుది జాబితాను రూపొందిస్తాయి. ఈ ఫైనల్ లిస్ట్‌ను డిసెంబరు 4న విడుదల చేయనున్నారు. ఈ జాబితాలో ఆర్యవీర్ సెహ్వాల్ పేరు ఉంటుందా? అతడిని ఏదైనా ఫ్రాంచైజీ సొంతం చేసుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.




