వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్‌కు లేదని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాయలసీమకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు.

గురువారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన బీటెక్ రవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమకు కృష్ణా జలాలను అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. పొరుగు రాష్ట్రాల నాయకులు సైతం చంద్రబాబు ప్రయత్నాలను ప్రశంసిస్తున్నారని పేర్కొన్నారు.

2020లోనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయించామని తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గతంలో వెల్లడించిన విషయంపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదే ఏడాది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఈ ప్రాజెక్టును నిలిపివేసిందని గుర్తుచేశారు.

వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టును ఆపేసిందంటూ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జీఓ 365 ద్వారా జగన్ ప్రభుత్వం రాయలసీమకు సంబంధించిన 102 సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేసిందని బీటెక్ రవి ఆరోపించారు. చంద్రబాబు హయాంలో రాయలసీమ ప్రాజెక్టుల కోసం రూ.13,500 కోట్లు ఖర్చు చేశారని వివరించారు.

మరోవైపు జగన్ పాలనలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో కేవలం మట్టి పనులు చేపట్టి రూ.1,000 కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వైసీపీ హయాంలో జరిగిన పరిణామాలకు జగన్ బాధ్యత వహించాలని బీటెక్ రవి డిమాండ్ చేశారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *