
తమిళనాడులో సినీ హీరోల అభిమానుల సమావేశాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా హీరో శివకార్తికేయన్ తన అభిమానులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆదివారం చెన్నైలోని పోరూరులో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 3 వేల మంది అభిమానులు, ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు.
అభిమానులకు శివకార్తికేయన్ సూచనలు
ఈ సందర్భంగా శివకార్తికేయన్ మాట్లాడుతూ.. తాను ప్రజల నుంచి వచ్చిన స్టార్ అని, అభిమానుల ప్రేమ, ఆదరణ వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు. జీవితంలో ఏ రంగంలో ఉన్నా లక్ష్యంపై స్పష్టత ఉండాలని సూచించారు. విమర్శలు చేసేవారు ఎప్పుడూ ఉంటారని, వాటిని పట్టించుకోకుండా అందరూ ఐక్యంగా, ప్రేమతో ముందుకు సాగాలని అభిమానులకు పిలుపునిచ్చారు.
విద్యార్థులతోనూ ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. బాగా చదువుకోవడంతో పాటు మంచి స్థాయిలో సంపాదించాలని, కుటుంబానికి ఎప్పుడూ తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విద్య పెరిగే కొద్దీ ఆలోచనా విధానం కూడా మెరుగవుతుందని, తద్వారా సోషల్ మీడియాపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని అన్నారు.
హీరోల ఫ్యాన్స్ మీట్లతో ఆసక్తి
తమిళనాడులో ఇటీవల పలువురు హీరోలు అభిమానులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ధనుష్, విశాల్ సైతం తమ అభిమానులతో భేటీ అయి ప్రజాసేవకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు. మరోవైపు కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ కూడా రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
ఈ నేపథ్యంలో శివకార్తికేయన్ నిర్వహించిన భారీ అభిమానుల సమావేశం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆయన రాజకీయ ప్రవేశంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు.
