
యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా తప్పకుండా చూడాల్సిన చిత్రంగా ‘తెల్ల కాగితం’ను దర్శకుడు రమేశ్ బండ్రెడ్డి అభివర్ణించారు. ఆయన దర్శకత్వంలో హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన ఈ సినిమాను కృష్ణ కొమ్మాలపాటి నిర్మించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి వస్తున్న స్పందన నేపథ్యంలో హైదరాబాద్‌లో శనివారం సక్సెస్‌మీట్ నిర్వహించారు.
స్వచ్ఛమైన మనసులతో చేసిన సినిమా
ఈ సందర్భంగా హీరో హర్ష్ రోషన్ మాట్లాడుతూ.. స్వచ్ఛమైన మనసులు కలిగిన కొందరు కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నమే ‘తెల్ల కాగితం’ అని తెలిపారు. పిల్లలతో పాటు పెద్దలు, కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాను ఆదరిస్తుండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
అన్ని ప్రాంతాల నుంచి మంచి స్పందన
నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘తెల్ల కాగితం’కు అన్ని ప్రాంతాల నుంచి మంచి స్పందన లభిస్తోందని చెప్పారు. సినిమాలో హర్ష్ రోషన్ భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు తనను కదిలించిందని, అతడు ఏడ్చే సన్నివేశాలను చూస్తుంటే తన కళ్లలోనూ నీళ్లు తిరిగాయని తెలిపారు.
ఈ సినిమాను నమ్మి కొనుగోలు చేసిన ఈటీవీ విన్ యాజమాన్యానికి ఆయన అభినందనలు తెలియజేశారు. సక్సెస్‌మీట్‌లో హీరోయిన్ నక్షత్ర, శ్రావ్య, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
