టాలీవుడ్ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేకు ‘లెనిన్’ మూవీ మంచి టర్నింగ్ పాయింట్‌గా మారింది. ‘మిస్టర్ బచ్చన్’, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ వంటి సినిమాల్లో గ్లామర్‌తో ఆకట్టుకున్నా.. ఆమె ఖాతాలో మాత్రం సరైన విజయం పడలేదు. దీంతో వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్న సమయంలో ‘లెనిన్’ సక్సెస్ భాగ్యశ్రీకి ఊరటనిచ్చింది. అంతేకాదు.. హీరో అఖిల్‌కు కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది.

హిట్ తర్వాత టాలీవుడ్‌కు దూరంగా..

ఫ్లాప్స్‌లో ఉన్నప్పటికీ భాగ్యశ్రీకి వరుస అవకాశాలు ఇచ్చిన టాలీవుడ్.. ఇప్పుడు ఆమె హిట్ కొట్టిన తర్వాత మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. ‘లెనిన్’ తర్వాత ఆమె మరో తెలుగు సినిమాకు సైన్ చేసినట్లు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఈ బ్యూటీ కూడా ఒకే ఇండస్ట్రీకి పరిమితం కాకుండా ఇతర భాషలపై ఫోకస్ పెంచుతోంది.

ఇప్పటికే తమిళ ప్రేక్షకులకు దగ్గరైన భాగ్యశ్రీ.. ‘కాంత’ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం శివకార్తికేయన్‌తో కలిసి ‘సేయాన్’ సినిమాలో నటిస్తోంది. ఇక త్వరలో మలయాళ చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టనుంది.

మోహన్‌లాల్‌తో తొలి సినిమా

భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్ ఎంట్రీ కూడా భారీగానే ఉండబోతోంది. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి ఆమె స్క్రీన్ షేర్ చేసుకోనుంది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ గంగా’ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ చిత్రానికి విష్ణు మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ధురంధర్’ ఫేమ్ శాశ్వత్ సచ్‌దేవ్ సంగీతం అందిస్తున్నారు. అర్జున్ రాంపాల్, పార్థిబన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

తెలుగులో సక్సెస్ అందుకున్న తర్వాత తమిళంలోనూ తన మార్క్ చూపిస్తున్న భాగ్యశ్రీ.. ఇప్పుడు మోహన్‌లాల్‌తో కలిసి మలయాళ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ‘ఆపరేషన్ గంగా’తో మాలీవుడ్‌లో ఈ బ్యూటీకి ఎలాంటి ఆదరణ లభిస్తుందో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సిందే.