బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్‌కు ‘దృశ్యం 3’ భారీ ఊరటనిచ్చింది. వరుస సినిమాల ఫలితాలతో కాస్త వెనుకబడిన ఆయనకు ఈ మూవీ సాలిడ్ సక్సెస్ అందించింది. మరోవైపు అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’తో తన ఫ్లాప్ పరంపరకు బ్రేక్ వేయగా.. ‘వెల్కమ్ టు ది జంగిల్’ యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకుంది. ‘హైవాన్’ మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

రీమేక్‌ అయినా కథలో భారీ మార్పులు

మలయాళంలో విజయం సాధించిన కథను యథాతథంగా తీసుకోకుండా ‘దృశ్యం 3’ కోసం దర్శకుడు అభిషేక్ పాఠక్ కథ, కథనంలో కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ ఆడియన్స్ నుంచి మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది.

రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్

‘దృశ్యం 3’ అజయ్ దేవగన్ కెరీర్‌లోనే అత్యంత వేగంగా రూ.100 కోట్ల మార్క్ అందుకున్న సినిమాగా నిలిచింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్న మూవీ.. ఐదు రోజుల్లో రూ.230 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

మండే రోజున కూడా సినిమాకు కలెక్షన్లు తగ్గలేదు. సోమవారం ఏకంగా రూ.21 కోట్ల వసూళ్లు రాబట్టి.. ఈ ఏడాది ఇండియాలో అత్యధిక ఫస్ట్ మండే కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది.

అజయ్ సోలో మార్కెట్‌పై డౌట్స్‌కు చెక్

‘సైతాన్’ తర్వాత అజయ్ దేవగన్‌కు చెప్పుకోదగ్గ సోలో హిట్ దక్కలేదు. గతేడాది వచ్చిన కొన్ని సీక్వెల్స్ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. ఈ ఏడాది ‘ధమాల్ 4’తో మల్టీస్టారర్, సీక్వెల్ కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజయ్.. డివైడ్ టాక్‌ను తట్టుకుని ఆ మూవీతో సుమారు రూ.220 కోట్ల వసూళ్లు సాధించాడు.

అయితే సోలో హీరోగా అజయ్ దేవగన్ మార్కెట్‌పై వస్తున్న సందేహాలకు ‘దృశ్యం 3’ గట్టి సమాధానం చెప్పింది. ప్రేక్షకులు తనను ఇప్పటికీ సోలో హీరోగా ఆదరిస్తున్నారనే విషయాన్ని ఈ సినిమా మరోసారి నిరూపించింది.

చేతిలో వరుస సినిమాలు

‘దృశ్యం 3’ సక్సెస్‌తో జోష్‌లో ఉన్న అజయ్ దేవగన్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ‘గోల్‌మాల్ 5’, ‘రేంజర్’, ‘చౌహాన్’ వంటి సినిమాలు ఆయన లైనప్‌లో ఉన్నాయి. వరుస విజయాలతో మరోసారి తన మార్కెట్‌ను మరింత బలపర్చుకోవాలని అజయ్ చూస్తున్నాడు.