బాలీవుడ్ స్టార్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అడ్వాణీ తమ అభిమానులకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ జంట త్వరలోనే రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. తమ రెండో సంతానం రాబోతున్న విషయాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించారు. ఈ సందర్భంగా “మరోసారి జీవితంలో అత్యంత విలువైన బహుమతిని పొందుతున్నాం.. మా హృదయాలు ప్రేమ, కృతజ్ఞతతో నిండిపోయాయి” అంటూ పోస్ట్ చేశారు.

ఏడాది తర్వాత మరో శుభవార్త

సిద్ధార్థ్, కియారా దంపతులకు 2025లో తొలి సంతానంగా కుమార్తె జన్మించింది. ఇప్పుడు ఆమెకు ఏడాది దాటిన సమయంలోనే మరో బిడ్డ రాబోతున్న విషయాన్ని ఈ జంట ప్రకటించింది. తమ కుమార్తెతో కలిసి చిన్నారి సాక్స్‌ను చూపిస్తూ చేసిన ఈ స్పెషల్ అనౌన్స్‌మెంట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

వీరి ప్రకటన సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారడంతో అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. దీంతో సిద్ధార్థ్–కియారా కుటుంబంలో మరోసారి ఆనందోత్సవాలు మొదలయ్యాయి.

‘షేర్షా’తో మొదలైన ప్రేమకథ

సిద్ధార్థ్, కియారా 2021లో విడుదలైన ‘షేర్షా’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ప్రేమలో ఉన్న విషయాన్ని పెద్దగా బయటపెట్టకుండా కొంతకాలం తమ రిలేషన్‌ను ప్రైవేట్‌గా ఉంచారు.

2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది.

పెళ్లి తర్వాత తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఎక్కువగా ప్రైవేట్‌గా ఉంచిన ఈ జంట.. ఇప్పుడు రెండో సంతానానికి సంబంధించిన శుభవార్తను అభిమానులతో పంచుకుంది. దీంతో సిద్ధార్థ్–కియారా అభిమానుల్లో సంబరాలు నెలకొన్నాయి.