
తమిళ సినీ పరిశ్రమలో మరో స్టార్ హీరో రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే తమిళనాడులో పలువురు సినీ ప్రముఖులు రాజకీయ బాట పట్టిన నేపథ్యంలో.. ఇప్పుడు హీరో ధనుష్ పేరు కూడా రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. తన అభిమాన సంఘాలను బలోపేతం చేయడంతో పాటు పలు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో తన అభిమానుల నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటున్న ధనుష్.. రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు తమిళ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
పార్టీ పేరు ఇదేనా?
తాజా నివేదికల ప్రకారం ధనుష్ కొత్త రాజకీయ పార్టీకి ‘తమిళగ ఎళుచ్చి కళగం’ అనే పేరు ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పేరును కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసినట్లు కొన్ని తమిళ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ధనుష్ ప్రతినిధులు మాత్రం పార్టీ పేరు ఇంకా అధికారికంగా ప్రకటించలేదని, రిజిస్ట్రేషన్ విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నట్లు మరో నివేదిక చెబుతోంది.
అభిమాన సంఘాలపై ఫోకస్
గత కొంతకాలంగా ధనుష్ తన అభిమాన సంఘాలను మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. జిల్లాల వారీగా అభిమాన సంఘాల వ్యవస్థను బలోపేతం చేయడం, సభ్యత్వ కార్యక్రమాలను నిర్వహించడం వంటి చర్యలు రాజకీయ ఎంట్రీపై ఊహాగానాలకు మరింత ఊతమిస్తున్నాయి. అభిమానులతో నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలపై కూడా ధనుష్ మాట్లాడినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
త్వరలో అధికారిక ప్రకటన?
పార్టీ పేరు, జెండా, విధానాలు, పార్టీ నిర్మాణం వంటి అంశాలపై ధనుష్ త్వరలో అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటివరకు ధనుష్ స్వయంగా తన రాజకీయ పార్టీపై అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ప్రస్తుతం ఆయన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన వార్తలు ప్రధానంగా మీడియా కథనాలు, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చల ఆధారంగానే ఉన్నాయి.
తమిళనాడులో సినీ తారల రాజకీయ ప్రవేశానికి ప్రత్యేకమైన నేపథ్యం ఉన్న నేపథ్యంలో.. ధనుష్ నిజంగానే రాజకీయ రంగంలోకి వస్తారా? వస్తే ఆయన పార్టీ పేరు, విధానాలు ఎలా ఉండబోతాయి? అనేది అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టత రానుంది.
