
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా ‘ఫౌజీ’పై భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘వరల్డ్ ఆఫ్ ఫౌజీ’ పేరుతో ప్రత్యేక టీజర్ వీడియోను విడుదల చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ద్వారా సినిమా నేపథ్యంతో పాటు ప్రభాస్ పోషిస్తున్న పాత్ర లుక్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
వేగంగా సాగుతున్న షూటింగ్
మరోవైపు ‘ఫౌజీ’ చిత్రీకరణ కూడా శరవేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న భారీ యాక్షన్ షెడ్యూల్ అక్టోబర్ 20 వరకు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అనంతరం దాదాపు పది రోజుల పాటు టాకీ పార్ట్ షూటింగ్ నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రభాస్‌పై ప్రత్యేకంగా రూపొందిస్తున్న మాస్ మాంటేజ్ సాంగ్‌ను కూడా చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
సినిమా యాక్షన్ పార్ట్ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతో ఓ కీలక ఫైట్ సీక్వెన్స్‌ను కొత్త ఫైట్ మాస్టర్ల పర్యవేక్షణలో రీషూట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అన్నీ అనుకున్న ప్రకారం జరిగితే నవంబర్ చివరి నాటికి మొత్తం షూటింగ్ పూర్తి చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
సమ్మర్లో రిలీజ్?
‘ఫౌజీ’ని తొలుత ఈ ఏడాది డిసెంబర్ 3న విడుదల చేయాలని భావించారు. అయితే ఇటీవల ఆ విడుదలను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే కొత్త విడుదల తేదీపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.
