తెలుగు సినిమాకు కొత్త ఆలోచనలు, సరికొత్త ప్రయోగాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు. 94 ఏళ్ల వయసులో వయోభారంతో కూడిన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటుగా మారింది. దాదాపు ఆరు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విభిన్న చిత్రాలను అందించిన సింగీతం.. ‘ప్రయోగం’ అనే పదానికి పర్యాయపదంగా నిలిచారు.

చిన్ననాటి నుంచే కళలపై ఆసక్తి

1931 సెప్టెంబరు 21న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో సింగీతం శ్రీనివాసరావు జన్మించారు. ఆయన తండ్రి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాగా.. తల్లి వయొలిన్‌ కళాకారిణి. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుకునే రోజుల్లోనే నాటకరంగంపై ఆసక్తి పెంచుకున్నారు. అదే సమయంలో హాలీవుడ్ సినిమాలను విస్తృతంగా వీక్షిస్తూ సినిమా మేకింగ్‌పై అవగాహన పెంచుకున్నారు.

తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడు కె.వి.రెడ్డి వద్ద అప్రెంటిస్‌గా చేరి సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ‘దొంగ రాముడు’, ‘ఉమా చండీ గౌరీ శంకరుల కథ’, ‘మాయాబజార్’, ‘జగదేకవీరుని కథ’, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ వంటి చిత్రాలకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.

ప్రతి సినిమాతో ఓ కొత్త ప్రయోగం

1972లో ‘నీతి నిజాయితీ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సింగీతం.. తొలి అడుగుల నుంచే తన ప్రత్యేకతను చాటుకున్నారు. ‘మయూరి’, ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’ వంటి చిత్రాలతో తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్లారు.

‘పుష్పక విమానం’తో దాదాపు సంభాషణలు లేకుండా మూకీ తరహా చిత్రాన్ని తెరకెక్కించి సంచలనం సృష్టించారు. ‘ఆదిత్య 369’లో టైమ్‌ మెషీన్‌ ద్వారా కాల ప్రయాణాన్ని చూపించి తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించారు. ‘సింగ్ గీతం’తో పాటలనే ప్రధాన సంభాషణలుగా మలిచి మరో వినూత్న ప్రయోగం చేశారు.

‘మయూరి’కి 14 నంది అవార్డులు

ప్రముఖ నృత్య కళాకారిణి సుధాచంద్రన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ‘మయూరి’ భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఏకంగా 14 నంది అవార్డులను సొంతం చేసుకుంది. ‘భైరవ ద్వీపం’ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా సింగీతం నంది అవార్డును అందుకున్నారు.

సుమారు 60 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లోనూ తనదైన ముద్ర వేశారు. కథ ఏదైనా.. దాన్ని ప్రేక్షకులకు కొత్తగా ఎలా చెప్పాలనే ఆలోచనే ఆయన సినిమాల్లో కనిపించేది.

వయసు కాదు.. ఆలోచనే ముఖ్యం

94 ఏళ్ల వయసులోనూ సింగీతం దర్శకత్వం నుంచి వెనక్కి తగ్గలేదు. ఇటీవల ‘సింగ్ గీతం’ చిత్రానికి దర్శకత్వం వహించి.. తనకు వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని మరోసారి నిరూపించారు. రిటైర్మెంట్‌ అనే ఆలోచన తనకు లేదని చెప్పిన ఆయన.. ఈ తరం జెన్‌-జీ ప్రేక్షకులకు కూడా తన ప్రయోగాత్మక ఆలోచనా విధానాన్ని పరిచయం చేశారు.

సింగీతం శ్రీనివాసరావు ఇక భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన సృష్టించిన సినిమాలు, చేసిన ప్రయోగాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. సాధారణంగా ఒక దర్శకుడు సినిమాలు తీస్తాడు.. కానీ సింగీతం మాత్రం ప్రతి సినిమాను ఓ ప్రయోగశాలగా మార్చారు. అందుకే తెలుగు సినిమా చరిత్రలో ‘సింగీతం అంటే ప్రయోగం.. ప్రయోగం అంటే సింగీతం’ అనే గుర్తింపు ఆయనకు శాశ్వతంగా నిలిచిపోతుంది.

సినిమా అనే కళారంగంలో ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసి.. వెండితెరపై తనదైన ముద్ర వేసిన ఈ సినిమా మాంత్రికుడి ప్రయోగాల ప్రయోగశాల ఇక మూగబోయింది. కానీ ఆయన ఆలోచనలు, ఆయన సినిమాలు, ఆయన సృష్టించిన అద్భుతాలు మాత్రం తరతరాల ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి.