
బాలీవుడ్లో తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిర్మాణ సంస్థల్లో మడాక్ ఫిల్మ్స్ ఒకటి. నిర్మాత దినేష్ విజన్ నేతృత్వంలో ఈ సంస్థ నుంచి కంటెంట్‌కు ప్రాధాన్యమిచ్చే విభిన్నమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముఖ్యంగా హారర్ కామెడీ జానర్లో వరుస చిత్రాలతో మడాక్ ఫిల్మ్స్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ‘ఛావా’ విజయంతో సంస్థపై అంచనాలు మరింత పెరిగాయి.
వరుస సినిమాలు.. తగ్గిన సక్సెస్ రేట్
‘ఛావా’ తర్వాత మడాక్ ఫిల్మ్స్‌కు ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. ‘భూల్ చుక్ మాఫ్’, ‘తెహ్రాన్’, ‘పరమ్ సుందరి’తో పాటు ఇటీవల వచ్చిన ‘కాక్టెయిల్ 2’ వరకు పలు చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఇప్పుడు రాబోయే సినిమాలపై మడాక్ ఫిల్మ్స్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
అక్టోబర్‌లో రెండు సినిమాలు
మడాక్ ఫిల్మ్స్ నుంచి అక్టోబర్‌లో రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇప్పటికే పూర్తయిన ‘పూజా మేరీ జాన్’ ఓటీటీ బాట పట్టగా.. ‘ప్రహార్’ మాత్రం థియేటర్లలో విడుదల కానుంది. దసరా సీజన్‌ను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
2008 ముంబయి ఉగ్రదాడుల అనంతరం సాగిన న్యాయ పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ పాత్రలో రాజ్‌కుమార్ రావు కనిపించనుండగా.. వామికా గబ్బీ కథానాయికగా నటిస్తోంది.
‘మహావతార్’ ఎప్పుడు మొదలు?
‘ఛావా’ తర్వాత విక్కీ కౌశల్‌తో మడాక్ ఫిల్మ్స్ ‘మహావతార్’ అనే భారీ మైథాలజీ చిత్రాన్ని ప్రకటించింది. అయితే అనౌన్స్మెంట్ తర్వాత ఇప్పటివరకు షూటింగ్ ప్రారంభం కాలేదు. తాజాగా నిర్మాత దినేష్ విజన్ ఈ సినిమా గురించి కీలక అప్డేట్ ఇచ్చారు.
2027 జనవరి చివరి నుంచి ‘మహావతార్’ షూటింగ్ ప్రారంభించి.. అదే ఏడాది జూన్ నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. 2027 చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
‘స్త్రీ 3’పై కూడా క్లారిటీ
ఇక మడాక్ ఫిల్మ్స్ హిట్ ఫ్రాంచైజీలో భాగమైన ‘స్త్రీ 3’పై కూడా దినేష్ విజన్ స్పష్టత ఇచ్చారు. శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని 2028లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో రాబోయే రోజుల్లో మడాక్ ఫిల్మ్స్ నుంచి వరుసగా భారీ ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
