టాలీవుడ్‌లో ప్రస్తుతం ఫోక్‌లోర్, మిథాలజీ, ఫాంటసీ, అడ్వెంచర్ కథలకు మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో సరికొత్త సినిమాటిక్ వరల్డ్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ‘మత్స్య’ సిద్ధమవుతోంది. యంగ్ హీరో వివస్వాన్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా అధికారిక గ్లింప్స్ తాజాగా విడుదలై ఆసక్తిని పెంచుతోంది.

గ్లింప్స్‌లో మిస్టీరియస్ ట్రావెలర్

‘అమ్మా.. కొత్త బెడ్‌టైమ్ కథ చెప్పమ్మా..’ అంటూ ఓ చిన్నారి అడగడంతో గ్లింప్స్ మొదలవుతుంది. దీనికి తల్లి ‘ఒక ఫిష్ కథ చెప్పనా..’ అంటూ చెప్పే వాయిస్ ఓవర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆ తర్వాత ఎన్నో వింతలు, అద్భుతాలతో నిండిన ఫాంటసీ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్తూ హీరో పాత్రను మిస్టీరియస్ ట్రావెలర్‌గా పరిచయం చేశారు.

తొలి సినిమానే అయినప్పటికీ వివస్వాన్ తన స్టైలిష్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ గ్లింప్స్ చూస్తే టాలీవుడ్‌కు మరో ప్రామిసింగ్ యంగ్ హీరో పరిచయం అవుతున్నాడనే అభిప్రాయం కలుగుతోంది.

నీటి అడుగున కనిపించిన భారీ చేప

గ్లింప్స్ చివర్లో వచ్చే విజువల్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. హీరో ప్రయాణిస్తున్న పడవ కింద నుంచి భారీ మిథికల్ ఫిష్ వేగంగా దూసుకెళ్లే సీన్ హైలైట్‌గా నిలిచింది. ఈ ఒక్క షాట్‌తోనే ‘మత్స్య’లో ఎలాంటి విజువల్ వరల్డ్‌ను ఆవిష్కరించబోతున్నారో మేకర్స్ హింట్ ఇచ్చారు.

ఫోక్‌లోర్, అడ్వెంచర్, ఫాంటసీ అంశాలను కలిపి ప్రేక్షకులకు ఇంతకుముందు చూడని అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తున్నట్లు గ్లింప్స్ స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

భారీ సాంకేతిక బృందం

జీబీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంహిత గణపతి ఇంటూరి ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిస్తున్నారు. రవి గోలి, తేజ కనకాల కలిసి కథను అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు.

అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైన్, సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ, ఉజ్వల్ గుప్తా సంగీతం ఈ ఫాంటసీ ప్రపంచానికి మరింత బలాన్ని చేకూర్చనున్నాయి. జే కృష్ణ డైలాగ్స్ అందిస్తుండగా.. దేవపుత్రి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్‌ను మేకర్స్ వెల్లడించనున్నారు.