
అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లో రూపాయి మళ్లీ పుంజుకుంటోంది. వడ్డీ రేట్లలోని వ్యత్యాసాలను ఉపయోగించుకుని వివిధ దేశాల కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టే క్యారీ ట్రేడర్లను ఆకర్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చేస్తున్న ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం, ఏఐ కంపెనీల షేర్లలో పెట్టుబడుల ఉత్సాహం తగ్గడంతో విదేశీ నిధులు భారత్ వైపు మళ్లడం కూడా రూపాయికి కలిసొస్తోంది. ఒక దశలో డాలర్‌తో పోలిస్తే రూ.96.96 స్థాయికి పడిపోయిన రూపాయి.. ప్రస్తుతం రూ.93 వద్ద కదలాడుతోంది. అయితే 2011తో పోలిస్తే భారత్‌కు ఉన్న వడ్డీ రేట్ల ప్రయోజనం గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడిదారుల ఆసక్తిని దీర్ఘకాలం కొనసాగించడం విధాన నిర్ణేతలకు సవాలుగా మారింది.
17 ఏళ్ల తర్వాత మళ్లీ క్యారీ ట్రేడ్ల జోరు
ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత క్యారీ ట్రేడ్లపై ఆర్బీఐ ఒక నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి పెట్టుబడులు రోడ్డుపై పడిన నాణేలను ఏరుకోవడంతో సమానమని హెచ్చరించింది. కొంతకాలం పాటు మంచి లాభాలు వచ్చినా.. ఒక్కసారిగా ఎదురయ్యే భారీ నష్టాలు గతంలో సంపాదించిన లాభాలన్నింటినీ తుడిచిపెట్టేయవచ్చని పేర్కొంది. విదేశాల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుని, రూపాయిలో పెట్టుబడులు పెట్టే ధోరణి భారతీయ బ్యాంకులు, కంపెనీల్లో పెరుగుతుండటంపైనా అప్పట్లో ఆందోళన వ్యక్తం చేసింది.
భారత్ వైపు విదేశీ నిధులు ఎందుకు వస్తున్నాయి?
దాదాపు 17 ఏళ్ల తర్వాత మరోసారి క్యారీ ట్రేడ్లకు ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రస్తుత త్రైమాసికంలో అమెరికా డాలర్లలో నిధులు సమీకరించి రూపాయిలో పెట్టుబడులు పెడుతున్న వారికి ప్రపంచంలోనే అత్యధిక రాబడులు లభిస్తున్నాయి. మరోవైపు ఏఐ రంగంలోని షేర్లపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గడంతో ఆ రంగం నుంచి నిధులు బయటకు వస్తున్నాయి. గత ఏఐ ర్యాలీలో పెద్దగా లాభపడని మార్కెట్ల వైపు విదేశీ మదుపర్లు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో భారత్ కూడా వారి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫలితంగా రూపాయిలో పెట్టుబడులకు డిమాండ్ పెరుగుతోంది.
ఇది శాశ్వత మార్పు కాదు!
భారత్‌లో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతున్నప్పటికీ.. రూపాయి ఎప్పుడూ అంతర్జాతీయ క్యారీ ట్రేడర్లకు తొలి ఎంపికగా నిలవలేదు. తాజా పరిణామాలతో రూపాయి అంతర్జాతీయ క్యారీ ట్రేడ్‌కు ప్రధాన గమ్యస్థానంగా మారుతుందా? అనే చర్చ మొదలైంది. అయితే ప్రస్తుత పరిస్థితులను చూసి రూపాయికి అలాంటి గుర్తింపు వస్తుందని భావించడం తొందరపాటేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం క్యారీ ట్రేడర్లు భారత్‌ను తాత్కాలిక పెట్టుబడి గమ్యస్థానంగా మాత్రమే చూస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్బీఐ చర్యలు, అంతర్జాతీయ మార్కెట్లో అనుకూల పరిస్థితులు కొనసాగినంతకాలమే పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని.. పరిస్థితులు మారితే విదేశీ మదుపర్లు మరో మార్కెట్ వైపు వెళ్లవచ్చని హెచ్చరిస్తున్నారు.
వడ్డీ రేట్ల కంటే రూపాయి స్థిరత్వంపైనే నమ్మకం
ప్రస్తుతం క్యారీ ట్రేడర్లు భారత్‌లో లభించే వడ్డీ ప్రయోజనం కంటే రూపాయి విలువకు ఆర్బీఐ అందిస్తున్న మద్దతుపైనే ఎక్కువగా ఆధారపడుతున్నట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. సెప్టెంబర్ చివరి నుంచి రూపాయిలో క్యారీ ట్రేడ్ ద్వారా వచ్చిన లాభాల్లో దాదాపు 80 శాతం కరెన్సీ విలువ పెరగడం వల్లే లభించాయి. 2011లో భారత్, అమెరికా మధ్య కీలక వడ్డీ రేట్ల వ్యత్యాసం 8.25 శాతం వరకు ఉండగా.. ప్రస్తుతం అది కేవలం 1.5 శాతానికి తగ్గింది.
గత మూడు దశాబ్దాలుగా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్రమంగా తగ్గుతూ రావడం కూడా పెట్టుబడిదారులకు ఆందోళన కలిగిస్తోంది. దీనికి తోడు రూపాయి మార్కెట్లో లావాదేవీలపై పరిమితులు, ఆర్బీఐ విధానాల్లో అనిశ్చితి విదేశీ పెట్టుబడులకు అడ్డంకులుగా మారుతున్నాయి. విదేశీ నిధులు దీర్ఘకాలం భారత్‌లో కొనసాగాలంటే వడ్డీ ప్రయోజనాలతో పాటు మార్కెట్ స్వేచ్ఛ, విధాన స్థిరత్వం కూడా అవసరమని బ్లూమ్‌బెర్గ్ విశ్లేషించింది.
రూపాయిని బలోపేతం చేసేందుకు ఆర్బీఐ చర్యలు
ప్రస్తుత పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకు ఆర్బీఐ పలు చర్యలు చేపడుతోంది. విదేశీ రుణాల ద్వారా డాలర్ల రాకను ప్రోత్సహించడంతో పాటు స్పాట్, ఫార్వర్డ్ కరెన్సీ మార్కెట్లలో జోక్యం చేసుకుంటోంది. రూపాయి విలువ తగ్గుతుందని అంచనా వేసి షార్ట్ పొజిషన్లు తీసుకునే పెట్టుబడిదారులకు ఖర్చులు పెరిగేలా నిబంధనలు విధిస్తోంది. దీంతో రూపాయిపై ప్రతికూలంగా పందెం కాసే వారికి నష్టభయం పెరుగుతోంది. ఈ చర్యలతో కరెన్సీ మార్కెట్లో రూపాయికి మద్దతు లభిస్తోంది.
క్యారీ ట్రేడ్లలో వివిధ కరెన్సీల రాబడులు ఇవే
సెప్టెంబర్ చివరి నుంచి డాలర్లను సమకూర్చుకుని ఇతర దేశాల కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టిన వారికి లభించిన రాబడులు (బేసిస్ పాయింట్లలో):
| కరెన్సీ | రాబడి (బేసిస్ పాయింట్లు) |
|---|---|
| భారత రూపాయి | 413 |
| తుర్కిష్ లిరా | 153 |
| కొరియన్ వాన్ | 96 |
| సౌదీ రియాల్ | 19 |
| చైనా యువాన్ | 11 |
ఈ గణాంకాల్లో భారత రూపాయి 413 బేసిస్ పాయింట్ల రాబడితో అగ్రస్థానంలో ఉంది. ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే రూపాయి పెట్టుబడిదారులకు మెరుగైన ప్రతిఫలాన్ని అందించింది. అయితే ఈ ప్రయోజనాలు కొనసాగాలంటే ఆర్బీఐ విధానాలతో పాటు అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండాల్సి ఉంటుంది.



