తమిళ స్టార్ హీరో విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. చిన్నతనం నుంచే విజయ్ కుమారుడిగా అభిమానులకు పరిచయమైన సంజయ్.. హీరోగా కాకుండా మెగాఫోన్ పట్టుకుని తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం ‘సిగ్మా’ విడుదల సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంజయ్‌కు, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

సంజయ్‌కు సూర్య, జ్యోతిక విషెస్

జాసన్ సంజయ్‌ దర్శకుడిగా పరిచయం కావడంపై హీరో సూర్య స్పందిస్తూ.. చిన్నప్పటి నుంచి చూస్తున్న సంజయ్ ఇప్పుడు దర్శకుడిగా మారడం ఆనందంగా ఉందని తెలిపారు. ‘సిగ్మా’ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

హీరోయిన్ జ్యోతిక కూడా సంజయ్‌కు అభినందనలు తెలిపారు. ఎంతో హుందాగా ఎదిగిన తీరు, అతడి నిజాయతీ తనను ఆకట్టుకున్నాయని పేర్కొంటూ.. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

కార్తి, శిబి సత్యరాజ్ కూడా..

సంజయ్ సినిమాను కెరీర్‌గా ఎంచుకోవడం సంతోషంగా ఉందని హీరో కార్తి తెలిపారు. అతడి కష్టం ఫలించి ‘సిగ్మా’ మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. మరోవైపు నటుడు శిబి సత్యరాజ్ కూడా సంజయ్‌కు శుభాకాంక్షలు చెబుతూ.. తొలి సినిమాతోనే అద్భుతమైన ఆరంభం దక్కాలని ఆకాంక్షించారు. ఇప్పటికే తన ఇంటర్వ్యూలతో సంజయ్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారని పేర్కొన్నారు.

‘నా సినిమా చూసి నాన్న గర్వపడతారు’

తన తొలి సినిమా ‘సిగ్మా’ను చూసి తండ్రి విజయ్ గర్వపడతారని జాసన్ సంజయ్ ఓ ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశారు. సాధారణంగా తన తండ్రి చాలా నిశ్శబ్దంగా ఉంటారని, సినిమా చూసిన తర్వాత స్పందించేందుకు కూడా సమయం తీసుకుంటారని చెప్పారు. ఒక సినిమాను పూర్తిగా విశ్లేషించిన తర్వాతే తన అభిప్రాయాన్ని చెబుతారని పేర్కొన్నారు.

అయితే ఇది తన తొలి సినిమా కావడంతో.. ‘సిగ్మా’ను చూసి తన తండ్రి కచ్చితంగా గర్వపడతారని సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరి దర్శకుడిగా సంజయ్ తొలి ప్రయత్నం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.