టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీపై మాజీ సారథి రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. భారత టెస్టు జట్టుకు కోహ్లీ అందించిన సేవలు, అతడి నాయకత్వంలో సాధించిన విజయాలు ప్రత్యేకమైనవని పేర్కొన్నాడు. తామిద్దరం చాలా కాలంగా భారత డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నామని, తమ మధ్య ఉన్న పరస్పర గౌరవం ఇప్పటికీ అలాగే ఉందని రోహిత్ తెలిపాడు.

కోహ్లీ కెప్టెన్సీలో భారత టెస్టు జట్టు ఎన్నో కీలక విజయాలను అందుకుందని రోహిత్ గుర్తుచేశాడు. 2014 నుంచి 2022 వరకు 68 టెస్టుల్లో టీమిండియాకు నాయకత్వం వహించిన కోహ్లీ.. 40 విజయాలు అందించాడు. 17 మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోగా.. 11 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. భారత టెస్టు కెప్టెన్లలో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించడంతో పాటు, అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా కోహ్లీ కొనసాగుతున్నాడు.

ఇక ఎంఎస్ ధోనీ 60 టెస్టుల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి 27 విజయాలు సాధించాడు. రోహిత్ శర్మ 2022 నుంచి 2024 వరకు 24 టెస్టులకు సారథ్యం వహించగా.. అతడి నాయకత్వంలో భారత్ 12 విజయాలు, 9 ఓటములు, 3 డ్రాలు నమోదు చేసింది.

బ్యాటింగ్‌పై కూడా చర్చలు

కెప్టెన్సీ, జట్టు విషయాలకే తమ సంభాషణలు పరిమితం కావని రోహిత్ చెప్పాడు. వ్యక్తిగత బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకునే అంశాలపైనా తామిద్దరం మాట్లాడుకుంటామని వెల్లడించాడు. తన ఆటలో ఏదైనా మార్పు అవసరమని కోహ్లీ భావిస్తే సూచనలు ఇస్తాడని, అలాగే కోహ్లీ బ్యాటింగ్‌లో తాను గమనించిన విషయాలను అతడితో పంచుకుంటానని రోహిత్ తెలిపాడు.

భారత క్రికెట్‌లో సుదీర్ఘకాలం కలిసి ప్రయాణించిన తమ మధ్య ఈ విధమైన చర్చలు ఎప్పటికీ కొనసాగుతాయని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు.

లండన్ వెళ్లిన కోహ్లీ.. తగ్గిన కలయిక

ప్రస్తుతం తామిద్దరూ తరచుగా కలుసుకోలేకపోతున్నామని రోహిత్ సరదాగా చెప్పాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో నివసిస్తుండటంతో తమ ఇళ్ల మధ్య దూరం పెరిగిందని పేర్కొన్నాడు. గతంలో ఐదు నుంచి ఏడు రోజులకు ఒకసారి కలుసుకునేవాళ్లమని, అయితే అప్పట్లో క్రికెట్ కారణంగా ఇంట్లో గడిపే సమయం చాలా తక్కువగా ఉండేదని గుర్తుచేసుకున్నాడు.

ఇప్పుడు ఇద్దరూ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతున్నప్పటికీ.. భౌగోళిక దూరం కారణంగా తరచుగా కలవడం కుదరడం లేదని రోహిత్ చెప్పాడు. తాజా వ్యాఖ్యలతో కోహ్లీ, రోహిత్ మధ్య ఉన్న అనుబంధం, పరస్పర గౌరవం మరోసారి స్పష్టమైంది.