
హీరో శర్వానంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘భోగి’. సినిమా ప్రకటన నుంచే ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు క్లాస్, ఫ్యామిలీ టచ్ ఉన్న పాత్రల్లో ఎక్కువగా కనిపించిన శర్వానంద్.. ఈసారి పూర్తి మాస్ అవతార్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది.
‘గంగ’గా శర్వానంద్
తాజాగా ‘భోగి’ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రా, రస్టిక్, ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ టీజర్లో శర్వానంద్ లుక్, పాత్ర అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సినిమాలో ఆయన ‘గంగ’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
రగ్గడ్ మేకోవర్‌తో శర్వానంద్‌ను మునుపెన్నడూ చూడని విధంగా చూపించారు. పక్కా మాస్ షేడ్స్‌తో కూడిన పాత్రలో ఆయన కనిపించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథకు తగ్గట్టుగా హీరో లుక్, యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.
సంపత్ నంది మార్క్ కనిపిస్తోంది
సంపత్ నంది తనకు బాగా కలిసొచ్చిన రస్టిక్, గ్రామీణ నేపథ్యాన్ని ఎంచుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. టీజర్లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ప్రత్యేకంగా కనిపించాయి. హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ‘భోగి’ శర్వానంద్ కెరీర్లో విభిన్నమైన చిత్రంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నవంబర్ 13న థియేటర్లలోకి?
‘భోగి’ని తొలుత ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే అనుకోని కారణాలతో సినిమా వాయిదా పడింది. ప్రస్తుతం షూటింగ్ దాదాపు పూర్తయిన నేపథ్యంలో నవంబర్ 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
