భారతీయ సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చివరి వరకు సినిమాపైనే ఆలోచించారు. 94 ఏళ్ల వయసులో ‘సింగ్ గీతం’తో ప్రేక్షకులను పలకరించిన ఆయన.. 95వ పడిలోకి అడుగుపెట్టిన సమయంలోనూ తన 62వ సినిమాకు స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు ఆయన శిష్యుడు, దర్శకుడు నాగ్ అశ్విన్ వెల్లడించారు. ఈ చిత్రానికి ‘ఎ ఫ్రూట్ కట్స్ ది నైఫ్’ అనే విభిన్నమైన టైటిల్‌ను సింగీతం ఖరారు చేసినట్లు తెలిపారు.

తన సరికొత్త ఆలోచనను తెరపై ఆవిష్కరించకముందే సింగీతం కన్నుమూయడం సినీ అభిమానులను విషాదంలోకి నెట్టింది. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలోనే మిగిలిపోయిన ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో వెండితెరపైకి వస్తుందా? అనే ఆసక్తి నెలకొంది.

చివరి వరకు సినిమానే లోకం

ఆరు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో సింగీతం శ్రీనివాసరావు 61 చిత్రాలకు దర్శకత్వం వహించారు. వయసు పెరిగినా కొత్త కథలు, ప్రయోగాత్మక ఆలోచనలపై ఆయన ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. ఈ ఏడాది జూన్‌లో ‘సింగ్ గీతం’ అనే సంగీతభరిత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. దాంతో తన సినీ ప్రయాణానికి ముగింపు పలకాలని అనుకోలేదు.

95వ ఏట కూడా కొత్త కథపై పనిచేయడం ద్వారా తనకు సినిమా పట్ల ఉన్న అంకితభావాన్ని మరోసారి చాటుకున్నారు. చివరి వరకు సృజనాత్మక ఆలోచనలతో ఉండటం ఆయన ప్రత్యేకతగా నిలిచింది.

టైటిల్‌లోనే సింగీతం మార్క్

సింగీతం తన 62వ చిత్రానికి పెట్టుకున్న టైటిల్ గురించి నాగ్ అశ్విన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సింగీతం తనతో పంచుకున్న వాట్సాప్ సందేశాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

‘ఎ ఫ్రూట్ కట్స్ ది నైఫ్’ అంటే ‘కత్తినే కోసే పండు’ అనే అర్థం వస్తుంది. సాధారణంగా కత్తితో పండును కోస్తాం. కానీ ఇక్కడ అందుకు పూర్తి భిన్నమైన ఆలోచనను టైటిల్‌గా ఎంచుకున్నారు సింగీతం. ఈ ఒక్క పేరులోనే ఆయన ఆలోచనా విధానం, ప్రయోగాత్మక శైలి కనిపిస్తోందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

తెరపైకి వస్తుందా?

సింగీతం ఊహించిన ఈ కథను ఆయన తెరకెక్కించకముందే కన్నుమూయడంతో ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తుపై ఆసక్తి పెరిగింది. గురువుతో ఎంతో అనుబంధం ఉన్న నాగ్ అశ్విన్ ఈ కథను ముందుకు తీసుకెళ్తారా? లేదా సింగీతం శిష్యుల్లో మరెవరైనా ఈ బాధ్యతను స్వీకరిస్తారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

‘ఎ ఫ్రూట్ కట్స్ ది నైఫ్’ తెరకెక్కుతుందా లేదా అన్నది పక్కన పెడితే.. చివరి దశలోనూ కొత్త కథను ఆలోచించిన సింగీతం శ్రీనివాసరావు సృజనాత్మక తపన మాత్రం భావితరాలకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలిచిపోతుంది.