అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. చెత్త వస్తువుల సేకరణలో దొరికిన ఓ పాత పెయింటింగ్‌ ఒక వ్యక్తి జీవితాన్నే మార్చేసింది. దాదాపు 70 ఏళ్లుగా ఆచూకీ లేకుండా పోయిన అరుదైన కళాఖండం అనూహ్యంగా వెలుగులోకి రావడంతో, దాని అసలు విలువ తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. చివరికి వేలంలో భారీ ధరకు అమ్ముడై.. అంచనాలకు మించి రికార్డు సృష్టించింది.

అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. ఓ వ్యక్తి స్క్రాప్‌ విక్రయాల్లో కేవలం 30 డాలర్లకు కొనుగోలు చేసిన చిన్న పాత పెయింటింగ్‌.. చివరకు అతని జీవితాన్నే మార్చేసింది. దాదాపు 70 ఏళ్లుగా కనిపించకుండా పోయిన అరుదైన కళాఖండంగా గుర్తింపు పొందిన ఈ పెయింటింగ్‌ ఇటీవల జరిగిన వేలంలో ఏకంగా 13.5 లక్షల డాలర్లకు (సుమారు రూ.13 కోట్లకు పైగా) అమ్ముడై సంచలనం సృష్టించింది.

30 డాలర్లతో మొదలైన అదృష్టం

అమెరికాలోని మిషిగన్‌ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి వినైల్‌ మ్యూజిక్‌ రికార్డుల కోసం కళామజూ నగరంలో జరిగిన ఎస్టేట్‌ సేల్‌కు వెళ్లాడు. అక్కడ విక్రయానికి ఉంచిన వస్తువులను పరిశీలిస్తుండగా.. ఓ చిన్న పెయింటింగ్‌ అతని దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా దాని వెనుక భాగంలో కనిపించిన పేరు తనకు పరిచయంగా అనిపించడంతో, పెద్దగా ఆలోచించకుండా కేవలం 30 డాలర్లు (సుమారు రూ.2,800) చెల్లించి దానిని కొనుగోలు చేశాడు.

అయితే అది సాధారణ పెయింటింగ్‌ కాదని, ఎంతో విలువైన అరుదైన కళాఖండమని తర్వాత తెలిసింది. దాదాపు ఏడు దశాబ్దాలుగా ఆచూకీ లేకుండా పోయిన ఈ చిత్రాన్ని గుర్తించడం కళా ప్రపంచంలో ఆసక్తికర పరిణామంగా మారింది.

1951లో చిత్రించిన అరుదైన కళాఖండం

ఈ పెయింటింగ్‌ను షికాగోకు చెందిన ప్రముఖ సర్రియలిస్ట్‌ కళాకారిణి గెర్ట్రూడ్‌ అబెర్‌క్రాంబీ 1951లో చిత్రించారు. ‘Alderman Merriam’s Shells’గా పిలిచే ఈ కళాఖండంలో అప్పటి షికాగో నగర కౌన్సిలర్‌ రాబర్ట్‌ మెరియమ్‌కు చెందిన సముద్రపు శంఖాలను చిత్రించారు.

నల్లటి నేపథ్యంపై శంఖాలపై వివిధ కోణాల్లో పడే వెలుతురు, చిత్రానికి ప్రత్యేకమైన రూపాన్ని అందిస్తుంది. ఈ కారణంగా పెయింటింగ్‌ చూసినప్పుడు ఒకేసారి వింతగా, కలలాంటి అనుభూతి కలిగేలా ఉంటుంది. సాధారణంగా కనిపించిన ఈ చిన్న చిత్రానికి ఇంత భారీ విలువ ఉందని కొనుగోలు చేసిన వ్యక్తి కూడా తొలుత ఊహించలేదని చెప్పొచ్చు.

1952లో అబెర్‌క్రాంబీ తన వైద్య సేవలకు కృతజ్ఞతగా డాక్టర్ జాన్ టి. రెనాల్డ్స్‌కు ఈ పెయింటింగ్‌ను బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత 1953లో చివరిసారిగా కనిపించిన ఈ కళాఖండం దాదాపు ఏడు దశాబ్దాల పాటు ప్రపంచానికి దూరంగా ఉండిపోయింది. అనూహ్యంగా అదే వైద్యుడి ఎస్టేట్ సేల్‌లో ఈ అరుదైన పెయింటింగ్ మళ్లీ వెలుగులోకి వచ్చింది.

ప్రపంచ రికార్డు స్థాయిలో వేలం:

షికాగోకు చెందిన నిపుణులు పెయింటింగ్‌ను శుభ్రపరిచి, పునరుద్ధరించిన అనంతరం ప్రముఖ వేలం సంస్థ ఫ్రీమాన్స్ ద్వారా విక్రయానికి ఉంచారు. తొలుత ఈ చిత్రానికి 15 వేల నుంచి 2.5 లక్షల డాలర్ల వరకు ధర పలకవచ్చని అంచనా వేశారు. అయితే వేలంలో కళాభిమానుల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో అంచనాలను మించి ఏకంగా 1.35 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.13 కోట్లు) అమ్ముడైంది.

అబెర్‌క్రాంబీ చిత్రాల్లో మిలియన్ డాలర్ల మార్కును దాటిన తొలి పెయింటింగ్‌గా ఇది రికార్డు సృష్టించింది. ఒకప్పుడు స్క్రాప్‌ల మధ్య సాధారణ చిత్రంలా కనిపించిన ఈ కళాఖండం.. దాదాపు 70 ఏళ్ల తర్వాత కోట్ల రూపాయల ధర పలికి ఆర్ట్ ప్రపంచంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.