
హార్దిక్ పాండ్యా ట్రేడ్పై సీఎస్కే సీఈఓ క్లారిటీ.. ప్రచారానికి చెక్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 సీజన్‌కు ముందు భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు ట్రేడ్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ముంబై ఇండియన్స్ తరఫున నిరాశాజనక సీజన్ ముగియడంతో అతడు జట్టును వీడే అవకాశాలపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ట్రేడ్ విండోలో అతడిని దక్కించుకునేందుకు పలువురు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నాయని ప్రచారం సాగుతోంది. ఈ జాబితాలో ఐపీఎల్ దిగ్గజ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కూడా ఉందన్న వార్తలు అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించాయి.
ఈ నేపథ్యంలో సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. హార్దిక్ పాండ్యాను ట్రేడ్ ద్వారా జట్టులోకి తీసుకురావాలనే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి అంతర్గత చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. “హార్దిక్ పాండ్యా ట్రేడ్ గురించి ఇప్పటివరకు మా ఫ్రాంచైజీలో ఎలాంటి చర్చ జరగలేదు. ముందుగా సీజన్ ప్రదర్శనపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తాం. ఆ తర్వాతే ట్రేడ్లపై నిర్ణయం తీసుకుంటాం. మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) ముగిసిన అనంతరం ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది” అని ఆయన హిందుస్థాన్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) టోర్నీ జూలై 18 వరకు కొనసాగనుంది. ఈ టోర్నీలో సీఎస్కే అనుబంధ జట్టు టెక్సాస్ సూపర్ కింగ్స్ కూడా బరిలో ఉంది. అందువల్ల ఎంఎల్‌సీ ముగిసిన తర్వాతే ఐపీఎల్ 2027 సీజన్‌పై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి, ఆటగాళ్ల ట్రేడ్లపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సీఎస్కే వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి.
మరోవైపు, టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మినహా దాదాపు అన్ని ఫ్రాంచైజీలు హార్దిక్ పాండ్యాపై ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అతడిని ట్రేడ్ ద్వారా దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయన్న ప్రచారం కూడా జరిగింది.
ఐపీఎల్ 2026 సీజన్‌లో సీఎస్కే ఆశించిన స్థాయిలో రాణించకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. 2025లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన చెన్నై.. 2026లో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. వరుసగా మూడు సీజన్లుగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోవడం, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అతని నాయకత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన కెప్టెన్ జట్టుకు అవసరమనే అభిప్రాయం వినిపిస్తోంది. భారత జట్టుకు కూడా నాయకత్వం వహించిన అనుభవం ఉన్న హార్దిక్ పాండ్యా సీఎస్కేకు సరైన కెప్టెన్ కావచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గత ఏడాది కూడా సీఎస్కే కీలక ట్రేడ్‌లో భాగమైంది. రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజు శాంసన్ చెన్నైకి రాగా, రవీంద్ర జడేజా రాజస్థాన్ జట్టులో చేరాడు. దీంతో ఈసారి కూడా సీఎస్కే మరో సంచలన ట్రేడ్‌కు సిద్ధమవుతుందా అనే చర్చ సాగుతోంది. అయితే ప్రస్తుతానికి హార్దిక్ పాండ్యా ట్రేడ్‌పై వస్తున్న వార్తలను సీఎస్కే యాజమాన్యం అధికారికంగా ఖండించింది. సీజన్ సమీక్ష అనంతరం పరిస్థితులు ఎలా మారతాయనేది ఆసక్తికరంగా మారింది.

