తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో గురువారం ప్రజల నిత్యజీవితానికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృత చర్చ జరిగింది. వ్యవసాయం, కూరగాయల సాగు, పాల ఉత్పత్తి, రైతుబజార్లు, విద్యుత్‌, ఆర్టీసీ, కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలు సభలో ప్రస్తావనకు వచ్చాయి. ఆయా అంశాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్‌ ప్రణాళికలను మంత్రులు వివరించారు. మరోవైపు శాసన మండలిలో వాయిదా తీర్మానాన్ని చైర్మన్‌ తిరస్కరించడంతో బీఆర్‌ఎస్‌ సభ్యులు వాకౌట్‌ చేశారు. అనంతరం శాసనసభను శుక్రవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు.

కూరగాయల సాగు ఎందుకు తగ్గింది?

కూరగాయలు, పండ్ల సాగులో పురుగుమందుల వినియోగంపై ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పురుగుమందుల వినియోగాన్ని నియంత్రించడంతోపాటు ఆహార భద్రత ప్రమాణాలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆమె సభ దృష్టికి తీసుకొచ్చారు.

దీనిపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ.. పురుగుమందుల అధిక వినియోగం కారణంగా తెలంగాణలో ఉత్పత్తయ్యే కూరగాయలు, పండ్లను కొన్ని దేశాలు తిరస్కరిస్తున్న పరిస్థితి ఉందని తెలిపారు. భూసార పరిరక్షణకు దోహదపడే ఎరువులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు అందించాలని గతంలోనే కోరినట్లు చెప్పారు.

అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోయిన విషయాన్ని మంత్రి వెల్లడించారు. గతంలో సుమారు 3 లక్షల ఎకరాల్లో కూరగాయలు సాగయ్యేవని.. ప్రస్తుతం ఆ విస్తీర్ణం కేవలం 50 వేల ఎకరాలకు పడిపోయిందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలు కూడా రైతులు పంటలను ఎంచుకునే విధానంపై ప్రభావం చూపుతున్నాయని వివరించారు.

By Ramya